పరిశ్రమలో ఎవరినీ ఉన్నతంగా ఊహించుకోవద్దని అంటున్నది బాలీవుడ్ నటి మాల్టీ చాహర్. గొప్పవాళ్లు అని భావించినవాళ్లే.. వేధింపులకు గురిచేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు పొందింది మాల్టీ చాహర్. నటిగా, నిర్మాతగా, కథా రచయిత్రిగా, దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకుంటున్నది. ఇటీవలే ముగిసిన హిందీ బిగ్‌బాస్-19లోనూ పాల్గొన్నది. దాదాపు ఎనిమిది వారాల పాటు హౌస్‌లో గడిపి.. చివరివారంలో ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మాల్టీ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇయిన ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడింది.
“దక్షిణాదిలో ఓ సినిమా అవకాశం వచ్చింది. స్టోరీ డిస్కషన్ చేద్దామంటూ.. ఆ చిత్ర నిర్మాత తన హోటల్ గది నెంబర్ ఇచ్చాడు. అతని దురుద్దేశం నాకు అప్పుడే అర్థమైంది. దాంతో, అతణ్ని నేను మళ్లీ కలవలేదు” అంటూ తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సంఘటన గురించి పంచుకున్నది. మరో సందర్భంలోనూ.. ఇండస్ట్రీలోని ఓ పెద్దమనిషి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించింది. “ఒక మీటింగ్ పూర్తి చేసుకుని బయటికి వస్తుండగా.. ఓ పెద్దమనిషి నాకు వీడ్కోలు చెబుతూ హగ్ చేసుకున్నాడు. నేను అతణ్ని తండ్రిస్థానంలో ఊహించుకొని దగ్గరికి వెళ్లా. కానీ, అతను మాత్రం నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఊహించని ఆ పరిణామానికి నేను షాక్‌కు గురయ్యా! వెంటనే తేరుకొని అతణ్ని పక్కకి తోసేశా. అక్కడే నిలదీశా!” అంటూ చెప్పుకొచ్చింది.
ఎంతో గొప్పగా ఊహించుకున్న ఆ వ్యక్తి.. అంత దారుణంగా ప్రవర్తించడం తనను బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఆ సంఘటన తనకు ఒక గుణపాఠం నేర్పిందని, అందుకే ఎవరినీ గొప్పగా ఊహించుకోకూడదని చెబుతున్నది. “ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వస్తున్న అమ్మాయిలను అవకాశాల పేరుతో కొందరు ఇబ్బంది పెడుతున్నారు. అందుకే, సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలు స్వతంత్రంగా ఉండాలి. ఎందుకంటే, ఇతరులు మనతో ఎలా ప్రవర్తిస్తారో మనం నియంత్రించలేం. కానీ, మనం బలంగా ఉంటే.. వారికి లొంగిపోవాల్సిన అవసరం ఉండదు. అవకాశాలు కోల్పోయినా స్థిరంగా నిలబడాలి. ఇండస్ట్రీలో మనుగడ, ఆత్మగౌరవానికి స్పష్టమైన సరిహద్దులు గీయడం ఎంతో అవసరం” అంటూ హితవు పలికింది. ప్రస్తుతం మాల్టీ చాహర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీం ఇండియా క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి అయిన మాల్టీ చాహర్.. ‘మేనిక్యూర్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. జీనియస్, ది లవర్స్, మా ఓ మేరి మా తదితర చిత్రాలలో నటించింది. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించింది.