దీపావళి రోజున బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు గోవర్ధన్ అస్రాని (84) సోమవారం ముంబయిలో కన్నుమూశారు. గతకొంత కాలంగా ఆయన వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. గోవర్ధన్ అస్రాని 1941 జైపూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్టుగా ఆయన కెరీర్‌ను మొదలుపెట్టారు. దర్శకులు కిశోర్ సాహు, హృషికేశ్ ముఖర్జీ సలహా మేరకు పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారు. ‘హమ్ కహా జా రహే హై’ (1966) చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేశారు.
ఆ తర్వాత ఏడాది విడుదలైన ‘హరే కాంచ్ కీ చూడియా’ చిత్రం నటుడిగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘షోలే’ చిత్రంలో ఆయన పోషించిన జైలర్ పాత్ర కెరీర్లో మంచి బ్రేక్ నిచ్చింది. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ కెరీర్లో హీరో హిందూస్థానీ, డ్రీమ్‌గర్ల్ 2 సహా 350 చిత్రాల్లో విభిన్న పాత్రల్లో మెప్పించారు. ‘చలా మురారీ హీరో బన్నే’ ‘ఉడాన్’వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాప్, పూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్ వంటి చిత్రాల్లో పాటలు పాడి అలరించారు. కెరీర్ ఆరంభంలో కొన్ని హిందీ, గుజరాతీ సినిమాల్లో హీరోగా నటించిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్న పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పించారు. గోవర్ధన్ అస్రాని మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.