Bloody Daddy Teaser | బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగులో విడుదల కాకపోయిన ‘అర్జున్ రెడ్డి’, ‘జెర్సీ’ వంటి సినిమాలను హిందీలో రీమేక్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక బాలీవుడ్లో ఈయనకు విభిన్న సినిమాలను చేసే నటుడుగా మంచి పేరుంది. ఇటీవలే షాహిద్ నటించిన ఫర్జీ వెబ్సరీస్కు తిరుగులేని వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం షాహిద్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో బ్లడీ డాడి సినిమా ఒకటి. అలి అబ్బాస్ జఫార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా న్యూట్ బ్లాంచే అనే ఫ్రెంచ్ మూవీ ఆధారంగా తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం హింసతో, రక్తపాతంతో, ఒళ్లు గగర్పొరిచే సీన్లతో ఉంది. మాఫీయా, డ్రగ్స్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతున్నట్లు మేకర్స్ టీజర్‌తో స్పష్టం చేశారు. ఈ సినిమా మొత్తం హీరో నెరేటీవ్లోనే సాగుతుందట. అంతేకాకుండా ఒక్క రాత్రిలోనే సినిమా మొత్తం కథ జరుగుతుందట. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నేరుగా జియో సినిమా ఓటీటీలో జూన్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జ్యోతి దేశ్‌పాండే, సునీల్ ఖేతర్పాల్ ఈ సినిమాను నిర్మించారు.