మంచి హిట్ కోసం కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన హీరోగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘బింబిసార’. ఎ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్.. అన్నది ఉపశీర్షిక. వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కేథరీన్, సంయుక్త మేనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేశారు.
ఇందులో కల్యాణ్‌రామ్ బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. “ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే… ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మెలేసింది. అదే త్రిగర్దన సామ్రాజ్యపు నెత్తుటి సంతకం… బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం… ” అనే పెద్ద డైలాగ్ టీజర్ లో ఆకట్టుకునే విధంగా ఉంది.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సెట్స్, విజువల్స్ హైలెట్ గా నిలిచాయి. టీజర్ చివర్లో కళ్యాణ్ రామ్ ఆధునిక వస్త్రధారణలో ఉగ్రరూపంలో కన్పించడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి టైం ట్రావెల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా టీజర్ నందమూరి అభిమానులను మెప్పించడమే కాకుండా ఇతర తెలుగు ప్రేక్షకులను సైతం ఆకర్షించింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. తెలుగుతో పాటు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.