Bigg Boss | బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 మరి కొద్ది రోజులలో మొదలు కానుంది. అయితే ఈ షోకి ముందస్తు పోటీగా నిర్వహిస్తున్న ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ నుంచి తాజా ఎపిసోడ్లో రెండు కీలక ఎలిమినేషన్లు చోటు చేసుకున్నాయి. ఈ అగ్నిపరీక్ష షోలో కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఎంపికైన 15 మందిలో, ఇద్దరు కంటెస్టెంట్లు జ్యూరీ మెంబర్స్ తీసుకున్న నిర్ణయంతో ఇంటి బయటకు వెళ్లిపోయారు. ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్స్ శ్వేత (ఫారిన్ నుంచి స్పెషల్‌గా వచ్చిన కంటెస్టెంట్), ప్రసన్న కుమార్. శ్వేత మొదట్లో గేమ్ బాగానే ఆడినప్పటికీ, టాస్కుల్లో స్పష్టతా లేకపోవడం, బెలూన్ టాస్క్‌లో టీమ్‌ను గెలిపించలేకపోవడం ఆమెపై ప్రభావం చూపింది.
అలాగే, ప్రసన్న కుమార్ టాప్ 15లో చోటు సంపాదించినప్పటికీ, ఆటలో ఒత్తిడి, సరైన ప్రదర్శన లేకపోవడంతో జ్యూరీ మెంబర్స్ అతన్ని తొలగించారు. ఇప్పటి వరకూ 2 ఎలిమినేషన్లు ముగియగా, మిగతా 13 మంది పోటీచేస్తున్న అగ్నిపరీక్షలో, మొత్తం 5 లేదా 9 మందిని మెయిన్ హౌస్‌లోకి పంపనున్నారు. అయితే ఈ సంఖ్య ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మరో మూడు రోజుల్లో మరికొంతమంది ఎలిమినేట్ కాబోతుండగా, చివరకు ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా హౌస్‌లోకి ఎవరెవరు ప్రవేశిస్తారో తేలనుంది. శ్వేత, ప్రసన్న ఎలిమినేషన్‌పై ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. “ప్రసన్నను హౌస్‌లో ఉండనివ్వాల్సింది” అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ ఇప్పటికే టీవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో, వారికి సెలబ్రిటీలతో సమానమైన క్రేజ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
హోస్ట్ నాగార్జున ఈ సీజన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సీజన్ 9లో పాల్గొననున్న సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ కూడా లీక్ అయింది. ఇప్పటికే 8-9 ప్రముఖులు హౌస్‌లో సందడి చేయనున్నట్లు టాక్ ఉంది. ఇక కామన్ మ్యాన్‌తో కలిపి ఈ సీజన్ మరింత రంజుగా మారే అవకాశాలు ఉన్నాయి.ఇక చూడాలి మరి… బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరెవరు ఎంటర్ అవుతారు? రణరంగం ఆరంభమవుతుందా..?