Bigg Boss | బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉండగా, ఈ ఆదివారం జరగబోయే ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకుని చివరి వారం ఎపిసోడ్లు సరదా టాస్కులు, భావోద్వేగ క్షణాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బుధవారం ఎపిసోడ్లో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన వినోదాత్మక టాస్క్‌లో ఇమ్మాన్యుయెల్ చేత ఇతర కంటెస్టెంట్ల జాతకాలు చెప్పించి నవ్వులు పూయించారు. పవన్, తనూజ, సంజనా, కళ్యాణ్ సహా పలువురిపై సరదా వ్యాఖ్యలతో హౌజ్ అంతా నవ్వుల హోరు కనిపించింది. ఈ ఎపిసోడ్లో ప్లేయర్ ఆఫ్ ది డేగా సంజనాను ప్రకటించగా, ఆమెకు ఇంటి నుంచి సర్ప్రైజ్ సందేశం అందింది. సంజనా చెల్లి నిక్కీ గల్రానీ పంపిన వీడియో సందేశం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
మూడు వారాల్లోనే బయటకు వస్తావనుకున్నామని, కానీ ఇంత దూరం రావడం గర్వంగా ఉందని పేర్కొంటూ, కప్‌తోనే తిరిగి రావాలని ఆకాంక్షించింది. అనంతరం టాప్ 5 కంటెస్టెంట్ల అల్టిమేట్ జర్నీ స్పెషల్‌లో భాగంగా మొదటగా ఇమ్మాన్యుయెల్ సక్సెస్ జర్నీని బిగ్‌బాస్ ప్రదర్శించారు. చిన్ననాటి కష్టాల నుంచి ఇక్కడివరకు వచ్చిన అతని ప్రయాణాన్ని ప్రశంసిస్తూ, మాటలనే ఆయుధాలుగా మలుచుకుని తెలివితేటలతో గేమ్ ఆడిన తీరు, ఎప్పుడూ నిజాయితీగా మంచి వైపున నిలిచిన విధానాన్ని బిగ్‌బాస్ కొనియాడారు. కమెడియన్‌గా ఇంట్లో అడుగుపెట్టి హీరోగా బయటకు రావాలన్న తల్లి కోరికను నిజం చేసినట్టుగా వ్యాఖ్యానించారు.
ఈ జర్నీ వీడియో చూసిన ఇమ్మాన్యుయెల్ భావోద్వేగానికి లోనై, ఇంత దూరం తీసుకొచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఇలానే ప్రోత్సహిస్తే చివరి వరకు ఎంటర్టైన్ చేస్తానని, నవ్విస్తూనే ఉంటానని చెప్పాడు. ప్రత్యేకంగా డెకరేట్ చేసిన గార్డెన్లో కుటుంబ ఫోటోలు, ముఖ్యంగా అమ్మతో ఉన్న ఫోటో చూసి మరింత ఎమోషనల్ అయిన ఇమ్మాన్యుయెల్ క్షణాలు ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి. తర్వాతి ఎపిసోడ్స్‌లో మిగతా కంటెస్టెంట్స్ ఎమోషనల్ జర్నీని కూడా ప్లే చేయనున్నారు. ఇవి ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించనున్నాయి.