Bigg Boss 9 | బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్ ఫుల్గా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం సిద్ధమైంది. అయితే ప్రతి సీజన్లో కూడా కొత్తదనం చూపించేందుకు ట్రై చేసే బిగ్ బాస్ టీం, ఈ సారి ప్రేక్షకుల్ని మరింత ఎంటర్టైన్ చేసేందుకు సరికొత్త కాన్సెప్ట్ ని తీసుకువచ్చింది. అదే “అగ్నిపరీక్ష”. ఇప్పటికే 18 వేల మందికిపైగా సామాన్యుల నుండి దరఖాస్తులు వచ్చాయి. వారి నుండి కేవలం 42 మందిని సెలెక్ట్ చేశారు. అయితే… అసలు ట్విస్టు ఏంటంటే.. ఈ 42 మందిలో చివరికి కేవలం ఐదుగురికే మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి ఎంట్రీ లభిస్తుంది.
ఈ ఐదుగురు ఎవరనే దాన్ని తేల్చే కీలక బాధ్యత మాత్రం బిగ్ బాస్ హిస్టరీలో మైలురాళ్లుగా నిలిచిన ముగ్గురు టప్ కంటెస్టెంట్స్ చేతుల్లో ఉంది .వారే అభిజిత్ , బిందు మాధవి,నవదీప్. గత నాలుగు రోజులుగా అగ్నిపరీక్ష షూటింగ్ జరుగుతుండగా, ఆ సిరీస్కు సంబంధించి ఒక చిన్న వీడియో లీక్ కావడం, వెంటనే అధికారిక ప్రోమో రిలీజ్ కావడం ఈ కాన్సెప్ట్ పై ఆసక్తిని రెట్టింపు చేసింది. ప్రోమోలో యాంకర్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి ఇదే మీ స్పాట్లైట్. ఇదే మీ ఎంట్రీ టికెట్. కానీ ఇది అంత తేలిక కాదు,’’ అంటూ వార్నింగ్ ఇస్తుంది.తర్వాత మైండ్ గేమ్స్ కి మాస్టర్ అనబడే అభిజిత్ ఎంట్రీ ఇస్తూ ..నేను మైండ్ గేమ్ ఆడతానని మీకందరికీ తెలుసు. కానీ ఈసారి మైండ్ బ్లాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి అని చెబుతాడు.
ఇక బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి తన స్టైల్లో.. మాస్క్ అంటేనే ఫేక్. నా ముందు ఉండేది రెండే ఆప్షన్స్, బ్లాకా?, వైటా? ఈ అగ్నిపరీక్ష అదే తేల్చేద్దాం అంటూ డేరింగ్ స్టేట్మెంట్ ఇస్తుంది. చివరగా, సీజన్ 1లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన నవదీప్ కూడా ఎంట్రీ ఇస్తూ .. సీరియస్ అయిపోకండి. ఎంటర్టైన్మెంట్ ఉండదని అనుకుంటున్నారా? నేను ఉన్నాను కదా! ఈ అగ్నిపరీక్షలో మీ స్ట్రెస్ ఎలా తగ్గించాలో, వాళ్లదేలా పెంచాలో చూస్తాను అని కాస్త హ్యుమర్ అద్దుతాడు. చివరి షాట్లో ఈ ముగ్గురు శ్రీముఖితో కలసి స్క్రీన్ పై కనిపిస్తారు. వీళ్ల వెనుక 42 మంది కొత్త కంటెస్టెంట్స్ కనిపిస్తారు. ఈ 42 మందిలో చివరికి ఎవరు ఐదుగురు ఫైనల్ ఎంట్రీ పొందుతారు? ఈ అగ్నిపరీక్ష ఎలాంటి ఎమోషన్స్, డ్రామా, గేమ్స్ తో నడుస్తుంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే… ఆగస్ట్ 22 వరకు వేచి చూడాల్సిందే. జియో సినిమా & హాట్స్టార్ లో మాత్రమే ఈ అగ్నిపరీక్ష సిరీస్ స్ట్రీమ్ కానుంది.