Bigg Boss 9 | తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తిచేసిన ఈ షో, తొమ్మిదో సీజన్‌తో మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సీజన్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభం కానుంది. బిగ్ బాస్ 9కి సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రోమోలో హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్లో ఎంట్రీ ఇస్తూ, “ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు… గెలుపు రావాలంటే యుద్ధం సరిపోదు, ప్రభంజనం సృష్టించాలి… ఈసారి చదరంగం కాదు రణరంగం!” అంటూ చెప్పిన డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఈ ప్రోమోతో సీజన్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక మొన్నటి వరకు సీజన్ 9 కి హోస్ట్ మారుతాడన్న ప్రచారం జరిగింది. విజయ్ దేవరకొండ లేదా బాలయ్యలలో ఒకరు షోని హోస్ట్ చేయనున్నట్టు పుకార్లు పుట్టించారు. కాని తాజా ప్రోమోతో కింగ్ నాగార్జునే మళ్లీ హోస్ట్‌గా కొనసాగనున్నట్టు అధికారికంగా స్పష్టం అయింది. ఎన్టీఆర్, నాని తర్వాత హోస్ట్ బాధ్యతలు అందుకున్న నాగార్జున, గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్‌కు తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, ‘కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2’లో పాల్గొన్న వారు, అలాగే త్వరలో ప్రసారం కాబోతున్న ‘కూక్ విత్ జాతిరత్నాలు’ కామెడీ షో కంటెస్టెంట్లలో కొందరు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
అలానే ఇటీవల వివాదాలతో వైరల్ అయిన సోషల్ మీడియా సెలబ్రిటీలను కూడా ఈ సీజన్లో తీసుకొచ్చేందుకు బీబీ టీమ్ ప్రయత్నిస్తోందట. ఇప్పటికే బమ్ చిక్ బబ్లూ, పికిల్స్ ఫేమ్ రమ్య (అలేఖ్య చిట్టి) లాంటి ప్రముఖులను బిగ్ బాస్ టీం సంప్రదించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే, బిగ్ బాస్‌కి అనుబంధంగా ప్రసారమయ్యే ‘బజ్’ షోకు గత సీజన్ ఫేమ్ ప్రేరణ కంభాన్ని హోస్ట్‌గా తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే, బిగ్ బాస్ 9 మరింత గ్రాండ్‌గా, యువతని అట్రాక్ట్ చేసే కంటెంట్‌తో తిరిగి బుల్లితెరపై హవా చూపించేందుకు సిద్ధమవుతోంది. కంటెస్టెంట్ల ఫుల్ లిస్టు అధికారికంగా వెల్లడయ్యేంతవరకూ ఈ బజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది.