Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి వారంలోకి అడుగుపెట్టింది. ఫినాలే దగ్గరపడుతుండటంతో హౌస్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ ప్రయాణాన్ని బిగ్ బాస్ ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో 102వ రోజున తనూజతో ఎపిసోడ్ ప్రారంభమైంది. బిగ్ బాస్ తనూజను ఒక రేంజ్లో ప్రశంసిస్తూ ఆమె జర్నీని గుర్తు చేసుకున్నారు. నటిగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న తనూజ, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నప్పటికీ బిగ్ బాస్ హౌస్‌లో నటించడం కుదరదని, అక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని బిగ్ బాస్ తెలిపారు. అయినప్పటికీ తనూజ ఎంతో ధైర్యంగా నిలబడి, బలంగా గేమ్ ఆడిందని ప్రశంసించారు. ఇతరుల సపోర్ట్ కోసం పాకులాడుతుందనే విమర్శలను కూడా ఆమె తట్టుకుని ముందుకు వెళ్లిందని, బంధాలు ఎదురైనప్పుడు ఆమె సున్నితత్వం బయటపడిందని, అవసరమైన వేళ వాటిని పక్కనపెట్టి తనలోని ధైర్యాన్ని చూపించిందని బిగ్ బాస్ పేర్కొన్నారు.
అనంతరం తనూజ హౌస్‌లో చేసిన అల్లరి, కన్నీళ్లు, బంధాలకు సంబంధించిన దృశ్యాలను ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ వీడియోలు చూసిన తనూజ భావోద్వేగానికి లోనైంది. ఎక్కడో పుట్టిన తాను ఈ రోజు బిగ్ బాస్ హౌస్‌లో ఉండడానికి కారణం తనను అభిమానిస్తున్న ప్రేక్షకులేనని ఆమె చెప్పింది. ఆ తర్వాత హౌస్‌లోకి వచ్చి తన ఆనందాన్ని ఇతర సభ్యులతో పంచుకుంది. ముఖ్యంగా కళ్యాణ్‌తో కలిసి ఉన్న దృశ్యాలు చూపించినప్పుడు ఆమె మరింత ఉత్సాహంగా స్పందించింది. కళ్యాణ్‌తో మాట్లాడుతూ ఉబ్బితబ్బిబైపోతూ కనిపించిన తనూజ, గతంలో 7వ తరగతిలో ఉన్నప్పుడు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించానని చెప్పిన సందర్భాన్ని కూడా బిగ్ బాస్ చూపించారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, సంఘటనలు వరుసగా ప్రదర్శించడంతో తనూజ మరింత సంబరపడిపోయింది. వీరిద్దరి మధ్య ఇప్పటికీ ‘సంథింగ్ సంథింగ్’ ఉందన్న పుకార్లు మరింత బలపడేలా ఈ దృశ్యాలు కనిపించాయి.
అనంతరం బిగ్ బాస్ పవన్ గురించి మాట్లాడారు. డిమాన్ పవన్ శక్తి, సామర్థ్యాలను ప్రశంసిస్తూ, ప్రేమించిన వారి కోసం నిలబడే అతని వ్యక్తిత్వాన్ని అభినందించారు. ప్రేమించిన వ్యక్తి బయటకు వెళ్లిపోతున్నప్పుడు పవన్ ఎంతగా బాధపడ్డాడో తనకు తెలుసని బిగ్ బాస్ అన్నారు. పవన్‌కు సంబంధించిన ఏవీలు చూపించడంతో అతడు కూడా ఎమోషనల్ అయి బిగ్ బాస్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. చివరి వారం ఎపిసోడ్లు ఇలా భావోద్వేగ క్షణాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.