Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకొంటున్న వేళ, హౌస్‌లో ఆట మరింత టైట్ అయింది. ప్రతి వారం కంటే ఈ వారం ఎలిమినేషన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. గత వారం ఎలిమినేషన్ జరగకపోవడంతో, ఈసారి మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఆడియన్స్ భారీగా అంచనా వేశారు. కానీ, బిగ్ బాస్ మళ్లీ తన శైలిలో ట్విస్ట్ ఇచ్చి, చివరకు ఒకరినే ఎలిమినేట్ చేశారు. ఈ వారంలో హౌస్ నుంచి బయటకు వెళ్లిన కంటెస్టెంట్ దివ్య. గత వారం ఇమ్మాన్యూయోల్ పవర్ ద్వారా సేవ్ అయిన దివ్య, ఈసారి తక్కువ ఓటింగ్ శాతంతో డేంజర్ జోన్లో పడింది. చివరిరౌండ్‌లో దివ్యతో పాటు సుమన్ శెట్టి ఉండగా, వారిలో దివ్య ఎలిమినేట్ అయింది.
హోస్ట్ నాగార్జున ఇద్దరినీ యాక్టివిటీ ఏరియాకు తీసుకెళ్లి, ప్రత్యేకంగా రూపొందించిన “అగ్నిపర్వతం ఎలిమినేషన్ సెటప్”లో నిలబెట్టారు. ఇద్దరికీ ఇచ్చిన లిక్విడ్‌ను అగ్నిపర్వతంలో పోయాలి, అందులో నుంచి వచ్చే రంగుతో ఎలిమినేషన్ జరుగుతుందని అన్నారు. ఆకుపచ్చ రంగు – సేఫ్, ఎరుపు రంగు – ఎలిమినేట్ అని చెప్పారు నాగ్. సుమన్ పోసిన వెంటనే ఆకుపచ్చ రంగు రావడంతో ఆయన సేఫ్ అయ్యారు. దివ్య పోసిన తర్వాత వచ్చిన ఎరుపు రంగు ఆమె ప్రయాణం ముగిసిన దానికి సంకేతం అని నాగార్జున ప్రకటించారు. సోషల్ మీడియాలో కొంతమంది ప్రేక్షకులు బిగ్ బాస్ డబుల్ గేమ్ ఆడాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గత వారం కూడా దివ్య సేఫ్ అయింది. ఈ వారం తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ, సుమన్‌ను కాపాడేందుకే దివ్యను బయటకు పంపించారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వారం నామినేషన్లో దివ్య, సంజన, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, భరణి ఉండగా, వారిలో దివ్యకే అత్యల్ప ఓట్లు సాధించినట్టు సమాచారం. దివ్య ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలు భరణితో ఎక్కువ బాండింగ్ , తనూజాతో తరచూ గొడవలు, గతవారం సేవ్ అయిన తర్వాత భరణిపై పెత్తనం చూపడం ఆడియన్స్‌కు అసహ్యం కలిగించిందని కామెంట్లు వచ్చాయి. భరణి ఎవరి తో మాట్లాడినా దివ్య మధ్యలో జోక్యం చేసుకోవడం చూసి, భరణి ఆట దెబ్బతిన్నదని అనేక మంది అభిప్రాయపడ్డారు.మొత్తం మీద…సీజన్ 9లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన కంటెస్టెంట్ దివ్య ప్రయాణం ఈ వారం ముగిసింది. ఇక ముందు ఎవరెవరు ఫినాలే రేసులో నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.