Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకీ మరింత హై వోల్టేజ్ డ్రామాతో ముందుకు సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ నిజంగానే రణరంగంలా మారింది. ఎమోషన్, రొమాన్స్, కామెడీ అన్నీ కలగలిపి ప్రేక్షకులకు వినోదం పంచుతున్నప్పటికీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో గేమ్ ఇప్పుడు మరింత హీటెక్కింది. హౌస్‌లో టాస్కులు, నామినేషన్లతో ఉద్రిక్తంగా మారుతుండగా, కంటెస్టెంట్ల మధ్య పోటీ పీక్స్‌కి చేరుకుంది. తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ “వైల్డ్ గోల్ గేమ్” అనే టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో నిర్వహించిన ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లు తమ ఎదురుగా ఉన్న గోల్‌పోస్ట్‌లో బంతిని వేయాల్సి ఉంటుంది.
ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే అది పూర్తిగా ఫిజికల్‌గా మారింది. ఆటలో భాగంగా భరణిని అడ్డుకునే ప్రయత్నంలో రమ్య కింద పడిపోవడంతో తలకు గాయం అయ్యింది . దీంతో ఆమె తాత్కాలికంగా ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు టాస్క్‌లోని హింసాత్మక వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తనూజ కౌంటర్ ఇస్తూ , “వైలెన్స్ మొదలుపెట్టింది మీరు కదా?” అంటూ ఘాటుగా స్పందించింది. ఈ వ్యాఖ్యలతో హౌస్‌లో వాతావరణం మరింత టెన్షన్‌గా మారింది. మరోవైపు మాధురి, రీతూ మధ్య మాటల యుద్ధం హౌస్‌లో హైలైట్‌గా మారింది. ఇద్దరి మధ్య నామినేషన్ నుంచి వచ్చిన పొరపచ్చాలు ఈ సారి టాస్క్ సమయంలో పెద్ద వాదనగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇద్దరూ హద్దులు దాటే స్థాయిలో ప్రవర్తించారు.
ఈ వారం కెప్టెన్సీ ఛాన్స్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకే ఇచ్చిన బిగ్ బాస్, చివర్లో కీలక ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ను కాపాడుకోవడం కూడా వారి బాధ్యతే అని ప్రకటించాడు. ఫైనల్ రౌండ్‌కి సుమన్, గౌరవ్, నిఖిల్ (నాగార్జున ఇచ్చిన పవర్ ద్వారా) ఎంపికయ్యారు. వీరిలో ఎవరు కెప్టెన్‌గా అవుతారో చూడాలి. అయితే హౌస్‌లో గొడవలు పెరుగుతున్నా, ఫన్ ఎప్పుడూ తగ్గడం లేదు. ఇమ్మాన్యుయేల్ తన కామెడీతో హౌస్‌లో నవ్వులు పూయిస్తున్నాడు. గతంలో తనూజతో ఫన్నీ మోమెంట్స్ పంచుకున్న ఇమ్ము, ఇప్పుడు రమ్యతో “అపరిచితుడు రాములా” స్కిట్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. మొత్తం మీద… గొడవలు, గాయాలు, నవ్వులు అన్నీ కలగలిసి ఈ వారం బిగ్ బాస్ హౌస్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా మారింది. ఇక రాబోయే ఎపిసోడ్లలో కెప్టెన్సీ ఎవరిదవుతుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.