Chiranjeevi | ‘భోళా శంకర్’ని ప్రేక్షకులకు నచ్చేలా..మెచ్చేలా తీశాం. ప్రస్తుత పరిస్థితుల్లో రీమేక్ చేయడమనేది రిస్క్ కంటే బిగ్ టాస్క్ అనుకున్నాం. ఒక సక్సెస్ఫుల్ సినిమాను కరెక్ట్‌గా తీయడంతో పాటు జనాలకు నచ్చేలా తీయాలి’ అన్నారు. దర్శకుడు మెహర్ రమేష్. తమిళ చిత్రం ‘వేదాలమ్’కు రీమేక్‌గా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’. అగ్రనటుడు చిరంజీవి, కీర్తిసురేష్, తమన్నా ముఖ్యతారలు. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మెహర్ రమేష్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
పదేళ్ల విరామం తరువాత దర్శకత్వం చేస్తున్నారు? ఇంత విరామం తీసుకోవడానికి కారణం?
కొన్ని కథలు చేసుకున్నాను. అయితే అన్నయ్య (చిరంజీవి) కమ్ బ్యాక్ ఇచ్చిన తరువాత ఆయనతోనే సినిమా చేయాలని అనుకున్నాను. నా కమ్ బ్యాక్ కూడా ఆయనతోనే అనుకున్నాను. అందుకే షాడోలో వున్నా నాపై మెగా లైట్ పడిందని ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పాను. అంతేకాదు ఏ దర్శకుడికి దక్కని అదృష్టం నాకు దక్కింది. నేను చిరంజీవికి కజిన్. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్ చేసి ఆయనతో బావుందిరా అనిపించుకున్నాను. ఇది పెద్ద అచీవ్మెంట్. దీని తరువాత చేసేదంతా బోనస్.
వేదాళం రీమేక్ చేయడానికి కారణం?
చిరంజీవిని అన్నయ్య అని పిలవడం తప్పితే మరో పదం వుండదు. ఇందులో అన్నయ్య తత్తం వుంది. అది నాకు చాలా నచ్చింది. జనరేషన్ మారిపోయినా అనుబంధాలు అలానే వున్నాయి. యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో పాటు బ్రదర్ సిస్టర్ ఎమోషన్ వున్న కథ ఇది. నేను ఇలాంటి కథను ఎప్పుడూ డీల్ చేయలేదు. ఒరిజినల్లో దాదాపు 70శాతం మార్పులు చేశాం. చిరంజీవి నాకు హిమాలయా శిఖరంలా కనిపిస్తారు. ఆ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేశాం.
కీర్తిసురేష్‌ను చెల్లెలు పాత్రలోకి తీసుకోవాలన్న ఆలోచన ఎవరిది?
మెగాస్టార్‌కి ఒక మెగా నటి కావాలి. స్వప్నదత్ ద్వారా ఈ పాత్ర గురించి చెప్పడం జరిగింది. ఈ కథలోని ఎమోషన్‌కి కీర్తిసురేష్ చాలా కనెక్ట్ అయ్యింది. వెంటనే ఓకే చెప్పింది. వాల్తేరు వీరయ్యలో బ్రదర్ సెంటిమెంట్‌కు రవితేజ ఎసెట్ అయితే ఇందులో కీర్తిసురేష్ పాత్ర కూడా సిస్టర్ సెంటిమెంట్‌గా హైలైట్‌గా వుంటుంది.
ఈ సినిమాలో చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు వుంది?
ఆయన నటించే ప్రతి సినిమాలో సలహాలు సూచనలు వుంటాయి. రీమేక్ సినిమా అయినప్పటికీ చిరంజీవికి నచ్చితేనే ఆమోదముద్ర పడుతుంది. ఏదైనా కొత్తగా చేస్తే చాలా చక్కగా ప్రశంసిస్తారు. చాలా విలువైన ఇన్పుట్స్ ఇస్తారు.
టోటల్‌గా భోళా శంకర్ ఎలా వుండబోతుంది?
కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కటి చిత్రంగా ఉంటుంది. వింటేజ్ చిరంజీవి గారిని ఈ చిత్రంలో చూడొచ్చు. ఆయన ఈ చిత్రంలో ఎంతో యూత్‌ఫుల్‌గా కనిపిస్తారు.