రివ్యూ: భోళా శంకర్
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, రవిశంకర్, శ్రీముఖి, హైపర్ ఆది, గెటప్‌శ్రీను, సత్య తదితరులు
సినిమాటోగ్రఫీ: డడ్లీ
సంగీతం: మహతి స్వరసాగర్
నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర హీరో చిరంజీవి. దాంతో తాజా చిత్రం ‘భోళా శంకర్’ పై భారీ అంచనాలేర్పడాయి. అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ (2015)కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో చాలా మార్పులు చేశామని దర్శకుడు మెహర్ రమేష్ ప్రచార కార్యక్రమాల సందర్భంగా తెలిపారు. ఈ సినిమా పాటలతో పాటు ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భోళా శంకర్’ అంచనాలను ఏ మేరకు అందుకుందో తెలుసుకుందాం…
కథ:
శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మీ (కీర్తి సురేష్) చదువు కోసం హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు వస్తాడు. అక్కడ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. నగరంలో అలెక్స్ (తరుణ్ అరోరా) నేతృత్వంలోని మాఫియా ముఠా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటుంది. ఈ విషయంలో శంకర్ పోలీస్ అధికారులకు సమాచారం అందించి కిడ్నాప్ రాకెట్ గుట్టురట్టు చేస్తాడు. అలెక్స్ బృందంలోని కొందరు నేరస్తులు పోలీసులకు పట్టుబడతారు. దీంతో శంకర్‌పై అలెక్స్ పగ పెంచుకుంటాడు? ఈ క్రమంలో ఏం జరిగింది? శంకర్ కోల్‌కతాకు రావడానికి అసలైన కారణం ఏమిటి? ఆయన గతం తాలూకు నిజమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథ నడుస్తుంది.
కథా విశ్లేషణ:
‘భోళా శంకర్’ ఏమాత్రం కొత్తదనం లేని ఫక్తు ఫార్ములా కథ. ఎప్పుడో 80దశకం నాటి ట్రీట్మెంట్తో దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా ఆసాంతం పేలవమైన కథ, కథనాలతో సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రేక్షకులకు కాస్త రిలీఫ్‌నిచ్చే అంశం ఏమైనా ఉందంటే అది చిరంజీవి తాలూకు ఛరిష్మా, నృత్యాల్లో ఆయన కనబరచిన గ్రేస్ మాత్రమే. ఈ సినిమా ప్రథమార్థం మొత్తం కలకత్తాలో అమ్మాయిల కిడ్నాప్ నేపథ్యంలో సాగుతుంది. చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్స్‌ను అభిమానులను మెచ్చేలా తెరకెక్కించారు. ఆరంభంలో చిరంజీవి, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాల్లో ఏ మాత్రం వినోదం పండలేదు. బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. చిరంజీవి, తమన్నా మధ్య నడిచే లవ్‌ట్రాక్ కూడా ఏమాత్రం ఆకట్టుకోదు. సన్నివేశాలన్నీ సాగతీతగా అనిపిస్తాయి. అసలు సినిమా కథలోని మెయిన్ పాయింట్ ద్వితీయార్థంతోనే ముడిపడి ఉండటంతో ఫస్టాఫ్ మొత్తం బోరింగ్ వ్యవహారంలా అనిపిస్తుంది. అయితే విరామంలో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ ఎలా ఉంటుందోననే ఆసక్తిని కలిగిస్తుంది.
ద్వితీయార్థంలో మాత్రం చిరంజీవి తనదైన కామెడీ, యాక్షన్‌తో మెప్పించాడు. కీర్తి సురేష్ ఇంటి నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో కాస్త హాస్యం పండింది. చిరంజీవి ఈ సినిమాలో చాలా హుషారుగా కనిపించారు. ఆయన లుక్స్ బాగున్నాయి. శ్రీముఖితో చేసిన ‘ఖుషి’ నడుము సీన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అన్నాచెల్లెళ్ల అనుబంధం అనే బలమైన సెంటిమెంట్ అంశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో భావోద్వేగాలు పూర్తిగా లోపించాయి. యాక్షన్ ఎపిసోడ్స్‌ను మాత్రం స్టెలిష్‌గా డిజైన్ చేశారు. చిరంజీవి ఎలివేషన్స్ ఆకట్టుకుంటాయి. ైక్లెమాక్స్ కూడా ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే సాగుతుంది. ఈ సినిమా కథాంశం విషయంలో నేటి ట్రెండ్‌కు తగినట్లుగా కాస్త హోమ్‌వర్క్ చేస్తే బాగుండేది. ఈ విషయంలో దర్శకుడు మెహర్ రమేష్ ఏ మాత్రం శ్రద్ధ తీసుకోలేదనిపిస్తుంది. అయితే చిరంజీవి మాత్రం తనవైపు నుంచి సినిమాకు పూర్తిగా న్యాయం చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆయన తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
నటీనటుల పనితీరు:
చిరంజీవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భోళా శంకర్ పాత్రలో తనదైన శైలి నటనతో మెప్పించారు. పాటలు, ఫైట్స్‌లో అభిమానులను ఫిదా చేశారు. ద్వితీయార్థంలోని కొన్ని సన్నివేశాలను చూస్తే కామెడీ టైమింగ్‌లో తనకు తానే సాటి ఆయన నిరూపించుకున్నారు. చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన నటనను కనబరచింది. ైక్లెమాక్స్లోని ఎమోషనల్ సీన్స్‌లో ఆమె అభినయం హైలైట్‌గా నిలుస్తుంది. తమన్నా పాత్రకు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్, సత్య, వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో కనిపిస్తుంది. మహతి స్వరసాగర్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తాయి. దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమా మేకింగ్‌లో ఏమాత్రం కొత్తదనం కనబరచలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్: 2.25/5