Thumkeshwari song | ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు టాలీవుడ్లో మార్కెట్‌పై కన్నేశారు. సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఏ భాష చిత్రాన్ని అయినా బ్లాక్‌బస్టర్ చేస్తారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోలు వాళ్ళ సినిమాలకు హిట్ టాక్ వస్తే చాలు, టాలీవుడ్లో ఈజీగా రెండు, మూడు కోట్ల వరకు షేర్ సాధించొచ్చు అని భావిస్తున్నారు. ఇటీవలూ రిలీజైన ‘బ్రహ్మస్త్ర’ సినిమాతో అది రుజువైంది. సెప్టెంబర్‌లో రిలీజైన ఈ చిత్రం తెలుగులో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఫైనల్‌గా డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇదే బాటలో మరో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ వస్తున్నాడు.
వరుణ్ ధావన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కెరీర్ బిగెనింగ్ నుండి కథా బలమున్న సినిమాలను చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు వరుణ్ ధావన్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘బద్లాపూర్’, ‘స్ట్రీట్ డ్యాన్సర్’ వంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నాయి. ప్రస్తుతం ఈయన ‘భేదియా’ చిత్రంపైనే ఉన్నాయి. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని తుమ్కేశ్వరి సాంగ్ తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేశారు.
ఇటీవలే హిందీలో రిలీజైన ఈ పాటకు విశేష స్పందన వచ్చింది. ఈ స్పెషల్ సాంగ్‌లో కృతి, వరుణ్ స్టెప్స్ అలరిస్తున్నాయి. సచిన్-జిగర్ సంగీతం అందించిన ఈ పాటను తెలుగులో కార్తిక్, అనుషా మని ఆలపించారు. అమితాబ్ భట్టాచార్య, యనమంద్ర రామకృష్ణ సాహిత్యం అందించారు. కామెడీ హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా కృతిసనన్ హీరోయిన్గా నటించింది. మడాక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా దినేష్ విజన్.. హార్రర్ కామెడీ యూనివర్స్‌లో మూడో ఇన్స్టాల్మెంట్గా ఈ చిత్రం తెరకెక్కింది. గతంలో ఈ యూనివర్స్‌లో తెరకెక్కిన స్త్రీ, రూహీ సినిమాలు భారీ విజయాలు సాధించాయి.