‘కొత్త మలుపు’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది అస్సామీ సుందరి భైరవి ఆర్థ్యా. ఆకాష్ హీరోగా నటించిన ఈ సినిమాకు శివవరప్రసాద్ దర్శకుడు. నేడు విడుదలవుతున్నది. ఈ సందర్భంగా కథానాయిక భైరవి ఆర్థ్యా విలేకరులతో సినిమా విశేషాలను పంచుకుంది. సినిమా ప్రయత్నాల్లో భాగంగా ఆడిషన్స్ ఇస్తూనే తెలుగు కూడా నేర్చుకున్నానని, షూటింగ్ సమయంలో చాలా మంది తనను తెలుగమ్మాయే అనుకున్నారని చెప్పిందీ భామ. ఈ సినిమాలో తాను వరలక్ష్మి అనే కోనసీమ అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, మనసుకు నచ్చినట్లు స్వేచ్ఛగా జీవించే గ్రామీణ అమ్మాయిగా తన పాత్ర సహజత్వంతో సాగుతుందని తెలిపింది.
షూటింగ్ సమయంలో కోనసీమ ప్రకృతి అందాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, షూటింగ్ ప్రారంభానికి ఒక నెలరోజులు అక్కడే ఉండి స్థానికుల జీవనశైలి, వేషభాషలపై అవగాహన పెంచుకున్నానని భైరవి ఆర్థ్యా పేర్కొన్నది. ‘హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. ఇక్కడి చికెన్ బిర్యానీ నా ఫేవరేట్. అలాగే నగర వాతావరణం, ఆతిథ్యం నన్ను కట్టిపడేసింది. భవిష్యత్తులో అభినయప్రధాన పాత్రల ద్వారా గుర్తింపు పొందాలన్నదే లక్ష్యం’ అని ఈ అస్సామీ సోయగం ఆనందం వ్యక్తం చేసింది.