‘అమ్మవారి నవరాత్రులు జరుగుతున్న సందర్భంలో ‘భగవంత్ కేసరి’ చిత్రం విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. స్త్రీ శక్తిని చాటే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ‘బనావో బేటీకో షేర్’ అనే బలమైన అంశాన్ని తెలియజెప్పాం. ఇలాంటి గొప్ప సందేశాత్మక చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు అగ్ర హీరో బాలకృష్ణ. ఆయన నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సోమవారం బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘ప్రతి మహిళా ఒక సైనికుడిలా తయారవ్వాలనే బలమైన సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజెప్పాం. పిల్లలతో కలిసి ఫ్యామిలీస్ ఈ సినిమా చూస్తున్నారు. ఓ మంచి సందేశం ప్రేక్షకుల్లోకి వెళ్లింది. ఇంత గొప్ప చిత్రాన్ని తీసిన దర్శకుడు అనిల్ రావిపూడిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా’ అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని ప్రతీ కుటుంబం థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నారు. బాలకృష్ణగారికి హ్యాట్సాఫ్. ఈ సినిమా విషయంలో నాపై పూర్తి నమ్మకం ఉంచి స్వేచ్ఛనిచ్చారు. ఈ విజయం వెనక పెద్ద శక్తిగా నిలిచారు. ఆయనతో ప్రయాణం ఇలాగే కొనసాగాలని, మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు.
సినిమాలోని సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నదని హీరోయిన్ శ్రీలీల పేర్కొంది. ఈ సినిమా విషయంలో తమ అంచనాలన్నీ నిజమయ్యాయని, ఫ్యామిలీ ఆడియెన్స్ అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్, అగ్ర నిర్మాత దిల్‌రాజు, నందిని రెడ్డి, రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.