‘నా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తీసిన సినిమా ‘భద్రకాళి’. ఇప్పటివరకూ వచ్చిన పొలిటికల్ కాన్సెప్ట్ చిత్రాలకు భిన్నంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు హీరో విజయ్ ఆంటోని. ఆయన తాజా చిత్రం ‘భద్రకాళి’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. అరుణ్‌ప్రభు దర్శకుడు. ఈ సందర్భంగా బుధవారం చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు…
‘భద్రకాళి’ పొలిటికల్ థ్రిల్లర్. దేశ సమకాలీన రాజకీయాలను చర్చిస్తుంది. ఇందులో నేను పొలిటికల్ మీడియేటర్ (బ్రోకర్) పాత్రలో కనిపిస్తా. సాధారణంగా రాజకీయ కథాంశాల్లో డ్రామా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఇందులో పాలిటిక్స్‌ను సహజంగా, వాస్తవికత ప్రధానంగా చూపించడం జరిగింది. రాజకీయాల్లో మీడియేటర్ ఏం చేస్తాడు? ఓ పెద్ద కుంభకోణంలో అతని పాత్ర ఏమిటి? అనే అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి.
నా కెరీర్లో 25వ సినిమా ఇది. దర్శకుడు అరుణ్‌ప్రభు అద్భుతమైన కథ తయారు చేశాడు. ఇలాంటి పొలిటికల్ బ్రోకర్ క్యారెక్టర్ ఇప్పటివరకూ రాలేదు. ప్రతి సన్నివేశం రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇందులో నేను మేకప్ లేకుండా నటించాను. కథలో భాగంగా వచ్చే నాలుగు పాటలు ఆకట్టుకుంటాయి.
నటుడిగా నాకు ప్రతిభ ఉందో లేదో తెలియదు కానీ..ప్రతీ సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను. ‘బిచ్చగాడు’ చిత్రం నుంచి తెలుగు ప్రేక్షకులు నన్ను గొప్పగా ఆదరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయుక్తమయ్యే చిత్రాల్లోనే నటించాలనుకుంటున్నా. ప్రస్తుతం యాక్టింగ్, ప్రొడక్షన్స్పైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నా. అందుకే మ్యూజిక్ డైరెక్షన్‌కు కాస్త దూరమయ్యా. భవిష్యత్తులో మ్యూజిక్ కోసం సమయం కేటాయించాలనుకుంటున్నా. ప్రస్తుతం ‘బిచ్చగాడు’ దర్శకుడు శశితో ‘వందదేవుళ్లు’ సినిమా చేస్తున్నా. బిగ్స్కేల్ మూవీ అది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతుంది.