Bethlehem Kudumba Unit | మలయాళంలో ఘన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రొమాంటిక్-కామెడీ ఎంటర్టైనర్ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) సినిమా తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. ‘ప్రేమలు’ వంటి సెన్సేషనల్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించిన దర్శకుడు గిరీష్ ఏ.డి. ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ భావన స్టూడియోస్ పతాకంపై దిలీష్ పోతన్, ఫహాద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ రిలీజ్ మరియు ఫ్యూచర్ రన్అప్ ఫిలిమ్స్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి.
ట్రైలర్ ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తూ, ఒక సరికొత్త ఫీల్-గుడ్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఇందులో నివిన్ పౌలీ మరియు మమిత బైజు ప్రధాన తారాగణంగా నటించగా, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే చుట్టుపక్కల ఉండే పాత్రలతో ముడిపడిన కుటుంబ నేపధ్యపు హాస్యం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ నిలవనుంది. మలయాళంలో ఆగస్టు 21న విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు తెలుగులో కూడా సెప్టెంబర్ 4న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. నివిన్ పౌలీ, మమిత బైజులతో పాటు సంగీత్ ప్రతాప్, సురేష్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, బిందు పణిగర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది.