లాస్ ఏంజిల్స్: సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ (Oscar Awards). ఈ అత్యున్నత అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతీ నటుడు, ఆర్టిస్ట్, టెక్నీషన్ అనుకుంటూ ఉంటారు. అలాంటి అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా సాగింది. ఈ వేడుకకు సినీ తారలతోపాటు టెక్నీషియన్స్ హాజరయ్యారు. ఉత్తమ సహాయ నటుడితో మొదలైన అవార్డుల ప్రదానోత్సవం బెస్ట్ పిక్చర్తో ముగిసింది.
ఉత్తమ నటుడిగా ‘ది బ్రూటలిస్ట్’లో నటనకుగాను అడ్రియన్ బ్రాడీ ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్ అకాడమీ అవార్డు అందుకున్నారు. బెస్ట్ మూవీగా అనోరా ఎంపికవగా, ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సీన్ బేకర్ బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు గెలుచుకున్నారు. మొత్తంగా అనోరా సినిమాకు ఐదు అవార్డులు దక్కాయి. ది బ్రూటలిస్ట్ సినిమాకు ఉత్తమ నటుడు, సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఆస్కార్ రాగా, డూన్ పార్ట్ 2 మూవీకి బెస్ట్ సౌండ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్టులు వచ్చాయి. ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ నుంచి నామినేట్ అయిన ‘అనూజ’ కు నిరాశే ఎదురైంది. ఆ కేటగిరిలో ఐయామ్ నాట్ ఏ రోబో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నటి అమేలియా డిమోల్డెన్‌బర్గ్ వ్యవహరించారు.