Lokesh Cinematic Universe | టాలీవుడ్, కోలీవుడ్‌లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)నుంచి మరో చిత్రం రాబోతుంది. ‘బెంజ్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ నేడు (మే 12, 2025) లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వార్త LCU అభిమానులకు చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తోంది.
ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్వయంగా ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు నిర్మిస్తున్నాడు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తుండగా.. మాధవన్ మలయాళం నటుడు నివిన్ పాలీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ముగ్గురు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బెంజ్’ చిత్రం LCUలో భాగం కానుండటంతో, ఇదివరకే విడుదలైన ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ చిత్రాల కథాంశాలతో దీనికి కనెక్షన్ ఉంటుందని తెలుస్తోంది. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనప్పటికీ, ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ విషయానికి వస్తే, ఇది దర్శకుడు లోకేష్ కనగరాజ్ సృష్టించిన ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఫ్రాంచైజీ. ప్రస్తుతం LCUలో విడుదలైన చిత్రాలలో ‘ఖైదీ’ (2019), ‘విక్రమ్’ (2022), ‘లియో’ (2023) ఉన్నాయి. ఇక రాబోయే చిత్రాలలో ‘కూలీ’ (2025), ‘బెంజ్’ (ఇప్పుడే షూటింగ్ ప్రారంభమైంది), ‘ఖైదీ 2’ (2025 చివరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది), ‘రోలెక్స్’ (‘విక్రమ్’లో సూర్య పోషించిన రోలెక్స్ పాత్ర ఆధారంగా ప్రత్యేక చిత్రం), ‘విక్రమ్ 2’, ‘లియో 2’, మరియు ‘LCU: చాప్టర్ జీరో’ (‘ఖైదీ 2’కు ముందు కథను తెలిపే షార్ట్ ఫిల్మ్) ఉన్నాయి.