Hathras Trailer | దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హాథ్రస్ ఘటన ఆధారంగా రూపొందిన హిందీ డాక్యు-సిరీస్ ‘హాథ్రస్’ అధికారిక ట్రైలర్ ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో విడుదలైంది. సమాజంలో ఎంతో చర్చకు దారితీసిన ఈ వివాదమైన అంశాన్ని, దాని వెనుక ఉన్న నిజాలను, బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని ఈ డాక్యు-సిరీస్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నట్లు తెలుస్తుంది. 2020 సెప్టెంబరులో ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన అత్యంత అమానవీయమైన అత్యాచార ఉదంతం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. నాటి భయానక పరిస్థితులను, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఈ ట్రైలర్లో ఎంతో హృదయవిదారకంగా చూపించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఎంతో నిజాయితీతో కూడిన పరిశోధనాత్మక శైలిలో రూపొందిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యథార్థ గాథలను, ఇన్వెస్టిగేటివ్ కథనాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సిరీస్ ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ పేర్కొంటున్నారు.
ఈ కథనానికి నేపథ్యమైన హాథ్రస్ ఘోరం 2020 సెప్టెంబర్ 14న జరిగింది. హథ్రాస్ జిల్లాలోని ఒక గ్రామంలో 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు దుర్మార్గులు క్రూరంగా అత్యాచారం చేసి, శారీరకంగా తీవ్రంగా హింసించారు. నిందితుల దాడిలో వెన్నెముక విరిగిపోయి, నాలుకకు తీవ్ర గాయాలైన ఆ బాధితురాలు ఢిల్లీలోని ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడి సెప్టెంబర్ 29న కన్నుమూసింది. అయితే ఆ తర్వాత బాధితురాలి మృతదేహాన్ని అర్ధరాత్రి వేళ కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా, వారిని గదిలో బంధించి పోలీసులే బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి, నిరసనలకు దారితీసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో ఈ కేసు విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఆ తర్వాత ప్రత్యేక కోర్టు ఈ కేసులో ప్రధాన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, మిగిలిన ముగ్గురిని ఆధారాలు లేకపోవడంతో విడుదల చేసింది. భారతదేశంలో మహిళల భద్రత, కుల వివక్ష మరియు పోలీసుల వైఫల్యాలపై తీవ్రమైన చర్చను లేవనెత్తిన ఈ దురదృష్టకర సంఘటనకు సంబంధించిన పూర్తి నిజాలను నిశ్శితంగా విశ్లేషిస్తూ రూపొందించిన ఈ సంచలనాత్మక డాక్యు-సిరీస్ ప్రస్తుతం జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.