వంశపారపర్యంగా వచ్చిన స్టార్డమ్ ఎలాగూ ఉంది. దాన్ని నిలబెట్టుకుంటూ.. సినిమా సినిమాకీ నటుడిగా ఎదుగుతూ.. అక్కినేని మూడోతరం జెండాని బలంగా ఎగరేస్తున్నారు యువసామ్రాట్ నాగచైతన్య. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో ఆయన నటించిన ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘తండేల్’ ఈ నెల 7న విడుదల కానుంది. ఆకాశమంత అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు కొండంత ఆశపెట్టుకున్నారు. అందరి ఆకాంక్ష తీరా సినిమా ఘన విజయం సాధించి తీరుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు నాగచైతన్య. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
రియల్‌లైఫ్ స్టోరీస్ ఆధారంగా చేసే సినిమాల్లో నటించాలనే కోరిక నాకెప్పట్నుంచో ఉంది. ‘దూత’ వెబ్‌సిరీస్ చేస్తున్న సమయంలో ఈ కథ గురించి విన్నాను. బన్నీవాసు ఈ కథను హోల్డ్ చేశారని తెలిసింది. స్వయంగా వెళ్లి కలిసి కథ విన్నాను. డాక్యుమెంటరీలా అనిపించింది. సినిమాటిక్ లాంగ్వేజ్‌లోకి తీసుకురావడానికి చాలా వర్క్ చేశాం. చివరకు అద్భుతంగా తయారైంది.
ఇది నా కెరీర్లో అన్ని విధాలుగా పెద్ద సినిమా. ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ పాత్ర చేశాను. నటుడిగా నన్ను మరోస్థాయిలో నిలబెట్టే క్యారెక్టర్ ఇది. దాని లైఫ్ ైస్టెల్ తెలుసుకోవాలని నేరుగా శ్రీకాకుళం వెళ్లాను. ఆ యాస కోసం ప్రత్యేకంగా ట్యూషన్ తీసుకున్నాను. స్క్రిప్ట్‌పై డైరెక్టర్ చందూ మొండేటి.. ట్రాన్స్ఫర్మేషన్ కోసం నేను.. ఎనిమిది నెలలు కష్టపడ్డాం. ఆ కష్టాన్ని తెరపై చూసుకున్నాక, పడిన కష్టం మొత్తం దూది పింజల్లా ఎగిరిపోయింది.
ఇది సముద్ర నేపథ్యంలో సాగే ప్రేమకథ. నాచురాలిటీ కోసం సముద్రంలో రియల్‌గా షూట్ చేశాం. అలా చేయడం పెర్ఫార్మెన్స్కు కూడా ప్లస్ అయింది. ముఖ్యంగా సెకండాఫ్ అయితే సూపర్. చివరి ముప్ఫై నిమిషాలు ఎంతో సంతృప్తినిచ్చింది. ఇక ైక్లెమాక్స్ అయితే గ్రేట్ ఎమోషనల్ హై ఇస్తుంది. ఇంకొన్ని గంటల్లో సినిమా విడుదల కానుంది. అందుకే చాలా ఎక్సయిట్మెంట్గా ఉంది.
దర్శకుడు చందూ మొండేటితో ఇది నా మూడో సినిమా. తనతో ట్రావెల్ చేయడం నాకిష్టం. నన్ను కొత్తగా ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. నాకోసమే ఆలోచిస్తాడు. ఈ సినిమాను కమర్షియల్‌గా పెద్దస్థాయికి తీసుకురావడానికి తను చేసిన కృషి అసామాన్యం. ఇక సాయిపల్లవి విషయానికొస్తే తనొక పాజిటివ్ ఎనర్జీ. పాత్రను డీప్‌గా అర్థం చేసుకొని నటిస్తుంది. అలాంటి నటితో పనిచేయడం నిజంగా ఓ సవాల్. గీతా ఆర్ట్స్‌లో ఇది నా రెండో సినిమా. తొలి సినిమా ‘100 పర్సంట్ లవ్’ పెద్ద హిట్. ఇది కూడా కచ్ఛితంగా హిట్టే. గీతా ఆర్ట్స్ ప్రొడక్ట్ బావుంటుంది. యాక్టర్‌కి మంచి రిలీజ్ ఇస్తారు. అవకాశం వస్తే మరోసారి గీతా ఆర్ట్స్‌లో నటించాలని ఉంది.