Barbarik director | ఇటీవల విడుదలైన టాలీవుడ్ సినిమా త్రిబాణధారి బార్బరిక్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నా, థియేటర్లలో ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో దర్శకుడు మోహన్ శ్రీవాత్స చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆయన రెండేళ్లపాటు తీవ్రంగా శ్రమించినప్పటికీ, ప్రేక్షకుల స్పందన నిరాశ కలిగించేలా ఉందని వాపోయారు. ఈ నేపథ్యంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ ఘటనపై తాజాగా స్పందించిన మోహన్ శ్రీవాత్స, తాను ఎందుకు అలా ప్రవర్తించాడన్న దాని వెనుక ఉన్న భావోద్వేగ కారణాలను వివరించారు: రెండేళ్లు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి సినిమాను తీశాం. మంచి టాక్ వచ్చింది. మేకింగ్ లో, కంటెంట్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అయినా థియేటర్ కు జనాలు రావడం లేదు. ఇది నా మనసును కలిచివేసింది అని అన్నారు.
ఒక థియేటర్లో షోకు గానూ కేవలం 10 మంది మాత్రమే హాజరయ్యారని, అందుకే తాను రెండు టికెట్లు కొనుక్కుని సినిమా చూశానని వెల్లడించారు.నేను దర్శకుడిని అని చెప్పకుండా ఇతరుల టాక్ అడిగితే వారు సినిమా బాగుందన్నారు. తర్వాత తన డైరెక్టర్ అనే విషయం తెలియగానే, వారు ఆయనను హగ్ చేసుకొని అభినందించారట. త్రిబాణధారి బార్బరిక్ కు కాస్త తక్కువ ఆదరణ ఉంటే, పక్క థియేటర్లో ఆడుతున్న మలయాళ సినిమాకు 90% ఆక్యుపెన్సీ ఉండటాన్ని చూసిన మోహన్ శ్రీవాత్స తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “మనం ఏం తప్పు చేశాం?” అనే ప్రశ్న తనను కలవరపరిచిందని అన్నారు. తక్కువ మంది చూస్తే సినిమా ఎలా పబ్లిక్ లోకి వెళ్లుతుంది? 5-6 మందితో టాక్ ఎలా వస్తుంది? ఇది చూసి నా భార్య సినిమా మధ్యలోనే బయటకి వెళ్లిపోయింది.
నువ్వు సినిమా పూర్తిగా చూసి రా అని చెప్పిన నేను ఇంటికి వచ్చేసరికి ఆమె వచ్చేసింది. కన్నీరు తుడుచుకుంటూ తాళం తీసి లోపలికి వెళ్లి గట్టిగా పట్టేసుకుంది. నేను ఎక్కడ ఇంటికి వచ్చేసి, ఏ ఫ్యాన్ కి ఉరేసుకుంటానేమో అని భయంగా ఆవిడ వచ్చేసింది. మనం పూరి గుడిసెలోనైనా బతుకుదాం. ఏం అవసరం లేదు అంది. నేను ఏమంటున్నాను అంటే.. నేను వాళ్లని సినిమా తీసి భయపెట్టేశాను. నా దగ్గర టాలెంట్స్ చాలా ఉన్నాయి. నేను బ్యూటిఫుల్ గా పాటలు పాడతాను. పియానో నేర్పిస్తాను. నాకు ఆ టాలెంట్ కూడా ఉంది. నాకు సస్టైన్ అవ్వడానికో, బతకడానికో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పారు.తాను భావోద్వేగానికి లోనై చెప్పుతో తానే తాను కొట్టుకున్న వీడియోపై కూడా మోహన్ శ్రీవాత్స స్పందించారు. దానికి నన్ను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయ్యారా? అయితే సారీ. మా ప్రొడ్యూసర్ కూడా ఫోన్ చేసి, మనం మంచి సినిమా చేశాం, జనాలు రాకపోతే మనకు తప్పేమీ లేదు, వీడియో డిలీట్ చెయ్యి అన్నారు. కానీ అప్పటికే అది వైరల్ అయిపోయింది అని వివరించారు.