Bapu Bomma Vishwa Mahila | హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో “బాపు బొమ్మ – విశ్వ మహిళ” అవార్డ్స్ ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు దివ్యవాణి చౌదరి సారధ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళామణులకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేశారు. ఈ వేడుకలో తొలి పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి శ్రీమతి కొణిదెల అంజనీదేవి అందుకోవడం విశేషం. అంజనీదేవితో పాటు రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి, ప్రముఖ యాంకర్ స్వప్న, జనేతా కంచర్ల (యు.ఎస్.ఎ), డాక్టర్ వెన్నెల గద్దర్, డాక్టర్ పద్మజా చంద్రకాంత్, గాయని సమీరా భరద్వాజ్, రేఖారాణి, డి. జ్యోతిరెడ్డి (యు.ఎస్.ఎ) తదితరులు ఈ గౌరవ పురస్కారాలను అందుకున్నారు.
తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ‘తెలుగు వన్’ అధినేత కంఠంనేని రవిశంకర్, నటుడు హర్షవర్ధన్, డిప్యూటీ కలెక్టర్ ఇ. వెంకటాచారి, ఏసీపీ ఎమ్. కిరణ్ కుమార్ తదితర ప్రముఖులు అతిథులుగా విచ్చేసి విజేతలను అభినందించారు. సినిమా, సామాజిక, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన దివ్యవాణి, ఈ అవార్డుల ప్రక్రియను మెగా మాతృమూర్తి అంజనీదేవితో ప్రారంభించడం శుభపరిణామమని వక్తలు కొనియాడారు. వివిధ రంగాల మహిళల్లో స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ దివ్యవాణి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో మహిళా సాధికారతకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఈ “బాపు బొమ్మ – విశ్వమహిళ అవార్డ్స్” వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లోనూ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు.