Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో నిందితుడికి వ్యతిరేకంగా పోలీసులు కీలకమైన ఆధారాలను గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో ముంబయి బాంద్రాలోని నివాసంలో బాలీవుడ్ నటుడిపై ఓ వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని షరీఫుల్ ఇస్లాం గుర్తించారు. ఈ కేసులో నిందితుడికి వ్యతిరేకంగా కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు.. వెయ్యి పేజీల ఛార్జ్‌షీట్‌ని దాఖలు చేశారు. ఈ కేసులో ముంబయిలోని బాంద్రా కోర్టులో పోలీసులు ఛార్జ్‌షీట్‌ని ఫైల్ చేశారు. ఇందులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను సైతం చేర్చారు. సైఫ్ అలీఖాన్‌పై శరీరం నుంచి దొరికిన కత్తి ముక్కలు, దర్యాప్తు సమయంలో పోలీసులు గుర్తించిన నిందితుడి ఎడచేతి వేలిముద్రల నివేదికను సైతం ప్రస్తావించారు. జనవరిలో బాంద్రాలోని తన ఇంట్లోకి చొరబడి నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను కత్తితో దాడి చేశాడన్న ఆరోపణల మేరకు నిందితుడు షరీఫ్‌ను అరెస్టు చేశారు. దాడి సమయంలో సైఫ్ వెన్నెముక దగ్గర ఇరుక్కుపోయిన కత్తి ముక్క, సంఘటనా స్థలంలో లభించిన కత్తిలోని కొంత భాగం, నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధానికి సరిపోలిందని కోర్టుకు తెలిపారు.
ఈ ఏడాది జనవరి 16న అర్ధరాత్రి సైఫ్ అలీఖాన్‌పై ఆయన ఇంట్లోనే కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఘటన తర్వాత వెంటనే కుటుంబీకులు సైఫ్‌ని చికిత్స కోసం లీలావతి ఆసుప్రతికి తరలించారు. ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. బాంద్రాలోని సైఫ్ నివాసంలోకి అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడి గదిలోకి వెళ్తుండగా చూసి అతడిని అడ్డుకున్నాడు. దాంతో అగంతకుడు సైఫ్‌తో ఘర్షణకు దిగి కత్తితో దాడిచేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. ఘటన జరిగిన సమయంలో సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ ఖాన్, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. బాంద్రావెస్ట్లోని 12 అంతస్తుల భవనంలోని నాల్గో అంతస్తులో సైఫ్ కుటుంబం నివాసం ఉంటుంది. నిందితుడి దాడిలో ఛాతీ, వెన్నెముక తదితర చోట్ల గాయాలయ్యాయి. లీలావతి ఆసుపత్రిలో చేర్పించగా.. కోలుకున్నారు. నిందితుడిని బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్‌గా గుర్తించారు. నిందితుడు బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించాడని.. ముంబయికి వచ్చే ముందు కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు తేల్చారు.