Bandla Ganesh | నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ తన స్పీచ్‌తో మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. కిరణ్ అబ్బవరం నటించిన K Ramp సినిమా విజయోత్సవ వేడుకకు గెస్ట్‌గా హాజరైన ఆయన, తన స్టైల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బండ్ల గణేష్, “తెలుగు సినీ పరిశ్రమలో నిజాయితీతో కష్టపడి ఎదుగుతున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ముందున్నాడు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి తన కలను సాకారం చేసుకున్నాడు. రాయచోటి నుంచి బెంగళూరు వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా నిలిచాడు. ఇలాంటి పట్టుదల చాలా అరుదు” అని ప్రశంసించారు.
అలాగే ఆయన మరికొన్ని వ్యాఖ్యలతో అక్కడి వారిని ఆకట్టుకున్నారు. “ఇప్పటి కాలంలో ఒక హిట్ పడగానే కొందరు వాట్సాప్ హీరోలు అయిపోతున్నారు. అర్ధరాత్రి కళ్లద్దాలు, లూజ్ ప్యాంట్లు వేసుకుని నడుస్తున్నారు. కానీ కిరణ్ మాత్రం రియల్ హీరో. ఆయనను చూస్తుంటే చిరంజీవి గారు స్టార్టింగ్ డేస్ గుర్తుకొస్తున్నారు,” అని అన్నారు. చిరంజీవి గారు 150 సినిమాలు చేసినా ఇవాళ్టికి నేల మీదే ఉన్నారు. కిరణ్ కూడా ఆ మార్గంలో నడవాలి. నీ క్యారెక్టర్ మార్చుకోకు. నీ ప్రతిభను స్క్రీన్ మీద చూపించు, బయట కాదు,” అని సలహా ఇచ్చారు. అదే సమయంలో ఆయన టాలీవుడ్‌లోని కొంతమందిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. “ఒక్క సినిమా హిట్ అయితేనే పెద్ద డైరెక్టర్ల పేర్లు చెప్పి ప్రాజెక్టులు అనుకుంటున్నారు. కానీ కిరణ్ మాత్రం ప్రతి సినిమాను కొత్త దర్శకులతో చేశాడు. ఇది నిజమైన ధైర్యం,” అని వ్యాఖ్యానించారు.
చివర్లో, “తమ్ముడు కిరణ్ మీద ప్రేమతో ఎక్కువ మాట్లాడితే క్షమించండి,” అని అన్నారు బండ్ల గణేష్.అయితే ఆయన చెప్పిన “వాట్సాప్ హీరోలు” వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించి అన్నారనుకుంటే, మరికొందరు అల్లు అర్జున్నే లక్ష్యంగా చేసుకొని కామెంట్లు చేసారని అంటున్నారు. ఎవరి పేరూ ప్రస్తావించకపోయినా, బండ్ల గణేష్ మాటలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ చిత్రం ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది.