Balakrishna Movies | ఈ మధ్య రీ-రిలీజ్ల గోల మరీ ఎక్కువైపోయింది. అందులోనూ టాలీవుడ్లో కొత్త సినిమాల రేంజ్లో రీ-రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకటి అయితే పర్వాలేదు. కానీ గంపగుత్తగా నెలలో రెండు, మూడు సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ చిరాకు తెప్పిస్తున్నారు. పైగా కలెక్షన్లు రాకపోయిన ఫేక్ నెంబర్స్ చెప్పి మరీ అభిమానులకు మధ్య గొడవలు పెడుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే ఈ మధ్యన రీజన్ లేకుండా హీరోల ఇమేజ్ను క్యాష్ చేసుకుని డిజాస్టర్ సినిమాలను కూడా రీ-రిలీజ్ చేస్తున్నారు. దాంతో హీరో ఇమేజ్ తగ్గించడమే తప్ప ఒరిగేది లేదు. హిట్టు సినిమాలనే పట్టించుకోని ప్రేక్షకులు.. ఫ్లాప్ సినిమాలను ఎలా పట్టించుకుంటారు అని కొంచెమైనా ఆలోచించకుండా సినిమాలను రీ-రిలీజ్లు చేస్తున్నారు.
ఆరెంజ్, యోగి వంటి ఫ్లాప్ సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ చూసి కొంత మంది బయ్యర్లు టీవీలో కూడా చూడడానికి ఇష్టపడని సినిమాలను రీ-రిలీజ్ అంటూ ప్రకటించేస్తున్నారు. ఆ మధ్య ఇలాగే ఆంధ్రావాల, రెబల్ వంటి ఫ్లాప్ సినిమాలను రిలీజ్ చేసి 4K ప్రింట్కు అయిన ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయారు. అది చూసైనా ఆగుతారా అంటే ఇప్పుడు ఏకంగా వాటిని మించి ఫ్లాప్ అయిన సినిమాలను దింపుతున్నారు. బాలయ్య ఫ్యాన్స్ సైతం భయపడే లయన్, ఒక్క మగాడు సినిమాలను త్వరలో రీ-రిలీజ్ చేస్తున్నట్లు ట్విట్టర్ హ్యాండిల్లో గత కొన్ని గంటల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఇది అబద్దం అయితే బాగుండు అనుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు.
ఎందుకంటే ఇవి మాములు డిజాస్టర్లు కావు. మాములుగా బాలకృష్ణ ఫ్లాప్ సినిమాలకు కూడా ఒకసారి చూడొచ్చు అనే పేరు ఉంది. కానీ ఈ రెండు సినిమాలు టీవీ కూడా చూడలేము అనే రేంజ్లో ఉంటాయి. కొద్దో గొప్పో లయన్లో రెండు, మూడు ఫైట్స్ సీన్స్ అయినా బావుంటాయి. కానీ ఒక్క మగాడు మాత్రం ఏ లెక్కన చూసుకున్నా పరమ బోరింగ్ సినిమానే. నరసింహానాయుడు, సింహా, చెన్నకేవశ రెడ్డి, లెజెండ్ వంటి హిట్ సినిమాలు రీ-రిలీజ్ చేసినప్పుడు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య కెరీర్లో ఎన్నో బంపర్ హిట్ సినిమాలున్నాయి. అలాంటి వాటిని వదిలేసి బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచిన లయన్, ఒక్క మగాడు సినిమాలు ఎందుకు రీ-రిలీజ్ చేస్తున్నారని నందమూరి అభిమానుల వాదన. మరి అందరి కోరిక మేరకు ఈ రెండు సినిమాల రీ-రిలీజ్లను ఆపేస్తారా.. లేదంటే చూస్తే చూడండి లేదంటే లేదు అని రుద్దేస్తారా అనేది చూడాలి.