వరుస విజయాలతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం మాస్ సినిమాకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారాయన. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా దర్శకులందరూ ఆయన కోసం కథలు రెడీ చేసుకునే పనిలోవున్నారు. ప్రస్తుతం బాలయ్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ డైరెక్టర్ బాబీ కొల్లిని వరించిన విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ ‘NBK 109’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం మొదలైంది.
ఈ సందర్భంగా కథనూ, అందులోని హీరో కేరక్టరైజేషన్నూ తెలియజేసే రీతిలో సృజనాత్మకంగా ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. పదునైన గొడ్డలి, ఆ గొడ్డలికి వేళ్లాడుతున్న ఓ తాయెత్తు, ఆ గొడ్డలికి తగిలించిన ఓ కళ్లజోడు. ఆ కళ్లజోడులో కనిపిస్తున్న భయంకరమైన రూపాలు.. ఏదో కథ చెబుతున్నట్టు ఈ పోస్టర్ ఉంది. మరి అసలు కథేంటో తెలియాల్సివుంది.
ప్రస్తుతం ఈ పోస్టర్ చర్చనీయాంశమైంది. సినిమాపై ఆసక్తిని కూడా రేకెత్తించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ శ్రీకర స్టూడియోస్. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.