అగ్ర హీరో బాలకృష్ణ వరుస విజయాలతో జోరుమీదున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్‌ను సొంతం చేసుకున్నారాయన. ఇదే ఉత్సాహంతో వరుస చిత్రాలకు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ 109వ చిత్రమిది. షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సీక్వెల్లో నటించనున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ‘అఖండ-2’కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలిసింది. త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇలోగా బాలకృష్ణ మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో పట్టాలెక్కనుందని ఫిల్మ్ నగర్ సమాచారం.