‘ఈ సినిమా కోసం ఎంతో పరిశోధన చేశాం. ‘ఆదిత్య 369’లో నేను పోషించిన కృష్ణదేవరాయలు పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. అలాంటి గుర్తుండిపోయే పాత్ర చేయాలనే ఆలోచన నుంచే డాకు మహారాజ్ క్యారెక్టర్ పుట్టింది’ అన్నారు అగ్ర నటుడు బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ రూపొందించిన ‘డాకు మహారాజ్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి..విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది.
ఈ నేపథ్యంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. నేను కలెక్షన్స్ గురించి అంతగా పట్టించుకోను. అభిమానులే నా ప్రచారకర్తలు. వాళ్లకు తెలుసు నా కలెక్షన్స్, రికార్డులన్నీ ఒరిజినల్ అని’ అన్నారు.
‘నేను చిరంజీవిగారి అభిమానినని చెప్పినా బాలకృష్ణగారు నన్ను దర్శకుడిగా ప్రోత్సహించారు. ఆయనకు నిజాయితీ అంటే ఇష్టం. అబద్ధాలకు ఆయన దగ్గర చోటులేదు’ అని దర్శకుడు బాబీ కొల్లి తెలిపారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ ‘బాలకృష్ణగారిని చూస్తేనే ఎనర్జీ వస్తుంది. అందుకే ఉత్సాహంగా సంగీతం చేశాను. ‘భైరవద్వీపం’ సినిమాకు డ్రమ్స్ వాయిస్తూ రోజుకి 30 రూపాయలు తీసుకుంటూ కెరీర్ ఆరంభించాను. ఇప్పుడు ఆయన సినిమాకు మ్యూజిక్ అందించడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయికలు శ్రద్ధాశ్రీనాథ్, ఊర్వశి రౌతేలాతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.