Bhagavanth Kesari | బాలకృష్ణ అభిమానులందరూ భగవంత్ కేసరి సినిమా కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకున్నాడు బాలయ్య. 1993లో బంగారు బుల్లోడు, భైరవద్వీపం సినిమాలతో వరుస విజయాలు అందుకున్న బాలయ్య.. ఆ తర్వాత మళ్లీ వరుసగా రెండు బ్లాక్‌బస్టర్స్ ఎప్పుడూ అందుకోలేదు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో ఈ ఫీట్ అందుకున్నాడు బాలయ్య. తాజాగా అనిల్ రావిపూడి సినిమాకు హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు.
దీనిపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 70 కోట్ల వరకు జరిగింది. బాలయ్య కెరీర్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమా ఇదే. ఓపెనింగ్స్ పరంగా కూడా కొత్త రికార్డులు సృష్టించేలా కనిపిస్తున్నాడు కేసరి. థియేటర్స్ వైస్ చూసుకున్నా కూడా బాలయ్య కెరీర్లో రికార్డు థియేటర్స్‌లో విడుదల కానుంది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా 1345 స్క్రీన్స్ లో భగవంత్ కేసరి విడుదలవుతుంది. నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ కావడంతో మంచి మంచి థియేటర్స్ అన్ని బాలయ్య చేతుల్లోకి వచ్చేశాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం. ఎందుకంటే దసరాకు రాబోయే సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్టు ఇదే. కాబట్టి కుటుంబ ప్రేక్షకుల చూపు కూడా బాలయ్య సినిమా మీదే ఉంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని నమ్మకంగా చెప్తున్నాడు బాలయ్య.
అంతేకాదు తన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే క్యారెక్టర్ భగవంత్ కేసరి అంటున్నాడు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఈ సినిమా సందడి మొదలైపోయింది. చాలా ఏరియాల్లో ఉదయం 4 గంటలకే షోలు వేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా భ్రమరాంబ థియేటర్‌తో పాటు మరికొన్నిచోట్ల బెనిఫిట్ షోలు పడుతున్నాయి. ఇక 7 గంటల షోలకు ఎలాగూ పర్మిషన్ ఉంది. ఏపీలో కూడా భారీగానే విడుదలవుతుంది బాలయ్య సినిమా. మొత్తానికి 70 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నాడు భగవంత్ కేసరి. పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈ టార్గెట్ పెద్దదేమి కాదు. చూడాలిక ఏం జరుగుతుందో..?