Sanjay Dutt | తెరపై హీరో, విలన్ కొట్టుకుంటే అది మామూలే. అదే ఇద్దరు హీరోలు తలపడితే ఫ్యాన్స్‌లో వచ్చే కిక్కే వేరు. రీసెంట్గా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అలాంటి కిక్‌నే ఇచ్చింది. అయితే.. వారిద్దరూ యువ హీరోలు. త్వరలో అలాంటి కిక్‌నే ఇద్దరు సీనియర్ హీరోలతో అందించడానికి రంగం సిద్ధమవుతున్నది. ఆ హీరోలు ఎవరోకాదు.. నందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ ఖల్నాయక్ సంజయ్‌దత్. ‘అఖండ 2 -తాండవం’లో కథ రీత్యా.. అఖండ రుద్ర సికిందర్ అఘోరాను ఢీకొట్టే పాత్ర ఒకటుందట.
ఆ పాత్ర కోసం దర్శకుడు బోయపాటి సంజయ్‌దత్‌ను సంప్రదించారట. కథ విని సంజయ్ కూడా ఓకే చెప్పేశారట. ఈ సినిమాను నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట పాన్ఇండియా స్థాయిలో నిర్మిస్తుండటంతో వివిధ భాషలనుంచి నటీనటులను తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కాక, కథ కూడా డిమాండ్ చేయడంతో సంజయ్‌దత్‌ని తీసుకోబోతున్నారని తెలుస్తున్నది.
ఇందులో బాలయ్య, సంజయ్ పాత్రల మధ్య పోరాటం నువ్వానేనా అనే స్థాయిలో ఉంటుందట. బాలకృష్ణ, సంజయ్ కెరీర్లను గమనిస్తే.. చాలా విషయాల్లో ఇద్దరిలో సారూప్యత కనిపిస్తుంది. ఇద్దరు 70ల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టినవారే. 80ల్లో హీరోలుగా ఎదిగినవారే. ఇద్దరూ మాస్ హీరోలే. పైగా ఇద్దరూ స్టార్ కిడ్సే కావడం విశేషం.