‘అఖండ 2’ విడుదల వాయిదా పడటంతో డీలా పడిపోయిన అగ్రహీరో బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. చిక్కుముడులన్నింటినీ విప్పుకొని, సమస్యలన్నింటినీ దాటుకొని ‘అఖండ 2: తాండవం’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నెల 5న పానిండియా స్థాయిలో విడుదల కావాల్సిన ఈ సినిమా నిర్మాతల ఆర్థిక సమస్యల కారణంగా అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థకు సదరు నిర్మాతలు కోట్లల్లో బకాయి పడటం, మద్రాస్ కోర్ట్‌కు ఈ పంచాయితీ చేరడం, కోర్టు విడుదలపై స్టే ఇవ్వడం వంటి అనూహ్య పరిణామాలతో సినిమా విడుదల ఆగిపోయింది. దాంతో కాసేపట్లో ప్రీమియర్స్ పడాల్సిన ‘అఖండ 2’కు అనుకోకుండా బ్రేక్ పడిపోయింది.
ఈ ప్రతిబంధకాలన్నింటినీ దాటుకొని ‘అఖండ-2’ విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ నెల 12న సినిమాను విడుదల చేయబోతున్నామని, 11వ తేదీ సాయంత్రం ప్రీమియర్ షోస్ ఉంటాయని మేకర్స్ ప్రకటించారు. దీంతో గత ఆరు రోజుల సస్పెన్స్‌కు తెరపడినట్లయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14ప్లస్ రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పానిండియా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.