సకుటుంబ కథా చిత్రం ‘బలగం’తో మరోసారి మంచి విజయాన్ని దక్కించుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయం నేపథ్యంలో తన సంతోషాన్ని తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు దిల్ రాజు.
నిర్మాతగా నేను ఎన్నో విజయాలు చూసినా.. ‘బలగం’ సక్సెస్ ప్రత్యేక అనుభూతిని ఇస్తున్నది. పరిశ్రమలో చిన్న స్థాయి నుంచి ఎదిగాను. కొత్త వాళ్లను ప్రోత్సహిస్తూ నేను నిర్మించిన ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’ సూపర్‌హిట్స్ అయ్యాయి. స్టార్స్‌తో సినిమాలు చేయడం ప్రారభించాక కొత్త వాళ్లతో నాకు అనుబంధం తగ్గిపోయింది. మా పిల్లలు హర్షిత్, హన్షితకు చిత్ర నిర్మాణం మీద ఆసక్తి ఉండటంతో దిల్‌రాజు ప్రొడక్షన్స్ స్థాపించాను. ఈ సంస్థలో యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నాం. చిత్ర నిర్మాణం తొలి అడుగులో హర్షిత్, హన్షిత విజయం సాధించారు. చిన్న చిత్రాలతో విజయం సాధిస్తే వచ్చే సంతృప్తి వేరు. చిత్ర నిర్మాణం దగ్గర నుంచి విడుదల వరకు అన్నీ నియంత్రణలో ఉంటాయి. ఈ సినిమా మొదలైనప్పుడు ఒక బడ్జెట్ ఇచ్చాను. ఇది దాటకుండా చేయాలని హర్షిత్, హన్షితకు చెప్పాను. నేను చెప్పినదానికంటే 25శాతం బడ్జెట్ పెరిగింది. నిర్మాణ వ్యయానికి ముందే ఒక హద్దు పెట్టుకోవడం మంచిది.
చిన్న సినిమాలంటే మనందరిలో ఒక చిన్న చూపు ఉంటుంది. దర్శకుడు వేణు ఈ కథ చెప్పినప్పుడే మనసుకు హత్తుకుంది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. ఈ కథలో మన సంస్కృతి ఉంది. సందేశంతో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. దాన్ని సినిమా కోసం కమర్షియలైజ్ చేయకుండా సహజత్వంతో సినిమా చేయమని వేణుకు చెప్పాను. మా టీమ్‌లోని వాళ్లు చిన్న సినిమా కదా ఓటీటీకి ఇచ్చేద్దాం అన్నారు కానీ నేను మాత్రం తప్పకుండా థియేటర్లో విడుదల చేయాల్సిన సినిమా ఇదని చెప్పాను. ఇలాంటి మంచి సినిమాలు ప్రేక్షకులకు చేరువకావాలి. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రీమియర్ షోస్ వేశాం. కొంతమంది హీరోలతో కూడా ఈ మూవీని ప్రమోట్ చేయించాలనే ఆలోచన ఉంది.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వేణు పనితనం నచ్చింది. అతను కొన్ని ఐడియాస్ చెప్పాడు. వాటిలో ఒకటి నచ్చి..దాని మీద వర్క్ చేయమని చెప్పాను. ఈసారి కొత్త వాళ్లతో కాకుండా ఓ పేరున్న హీరోతో డిఫరెంట్ మూవీ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అది కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుంది.