Bala Krishna | టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్న కాంబినేషన్లలో ఒకటిగా మారిన నటసింహం నందమూరి బాలకృష్ణ – దర్శకుడు కొరటాల శివ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కోసం బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలోని సెకండ్ హాఫ్‌లో వచ్చే కీలక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారట. ముఖ్యంగా ఈ పాత్ర కోసం ఆయన హెయిర్ స్టైల్లో ప్రత్యేక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిమ్ ప్రత్యేకంగా బాలయ్య కోసం కొత్త హెయిర్ డిజైన్ రూపొందిస్తున్నట్లు సమాచారం.
కేవలం హెయిర్ స్టైల్ మాత్రమే కాదు, బాలకృష్ణ డ్రెస్సింగ్ స్టైల్లో కూడా మార్పులు చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అభిమానులు చూడని విధంగా అల్ట్రా స్టైలిష్ మాస్ లుక్‌లో నటసింహం కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ విషయానికి వస్తే, ఆగస్టు నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌ను భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా ఈ సినిమాలో సమాన ప్రాధాన్యం ఉండబోతుందని తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కీలకంగా ఉండనున్నాయని, కొరటాల శివ తన స్టైల్‌కు తగ్గట్టుగానే బలమైన సందేశంతో కూడిన కథను సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. దేవర తర్వాత కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కథ విషయంలో ఆయన చాలా సమయం తీసుకుని కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇక నిర్మాణ బాధ్యతలను నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. బాలయ్య ఇప్పటికే వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉండగా, కొరటాల శివతో మొదటిసారి జతకట్టడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్ కలిస్తే ఈ సినిమా మరో భారీ హిట్‌గా నిలుస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.