Bala Krishna | గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. తనపై తరచూ వినిపించే “పొగరు” వ్యాఖ్యలపై ‘అఖండ 2 తాండవం’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరిని చూసుకుని బాలకృష్ణకు అంత పొగరు అని చాలా మంది అంటుంటారు. నన్ను చూసుకునే నాకు ఇంత పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తనది పొగరు కాదని, అది ఎక్కడ నుంచి వస్తుందో తనకే తెలియదని చెప్పారు.
‘అఖండ’ నుంచి ‘అఖండ 2 తాండవం’ వరకు వరుసగా తాను నటించిన ఐదు సినిమాలు విజయం సాధించడంపై బాలయ్య గర్వం వ్యక్తం చేశారు. “అఖండ 2 తర్వాత రాబోయే సినిమా కూడా అద్భుతమైన చరిత్ర సృష్టిస్తుంది. చరిత్రలో చాలామంది ఉంటారు. కానీ సృష్టించిన చరిత్రను మళ్లీ తిరగరాసి కొత్త చరిత్ర సృష్టించేది ఒక్కరే. చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా మేమే” అంటూ తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేశారు. తనకు వృత్తి దైవమని, ఆ వృత్తి ‘అఖండ 2 తాండవం’లో చేసిన పాత్రేనని బాలకృష్ణ చెప్పారు. పాత్ర చేయడం అంటే పరకాయ ప్రవేశంలాంటిదని, అది ఒక్క నందమూరి తారక రామారావు గారికే సాధ్యమైందని పేర్కొన్నారు.
ఇక సినిమా విజయం గురించి మాట్లాడుతూ, “‘అఖండ 2 తాండవం’ అద్భుతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రేక్షకులు ఈ సినిమా సనాతన హైందవ ధర్మం మీసం మేలేసిందని చెబుతున్నారు. ఇది కేవలం భారతం, భాగవతానికి సంబంధించిన సినిమా కాదు… దేశ గొప్పతనం గురించి చెప్పిన సినిమా” అన్నారు. కోవిడ్ సమయంలో విడుదలైన ‘అఖండ’ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా అనే అనుమానాల మధ్య విడుదలై ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. ఆ సినిమా విజయం తర్వాతే పరిశ్రమకు ధైర్యం వచ్చిందని తెలిపారు. ‘అఖండ’లో దేవుడు మనిషిలో ఉన్నాడని చెప్పామని, ‘అఖండ 2’లో మనిషే దేవుడైతే ఏమవుతుందనే ఆలోచనను చూపించామని చెప్పారు. “సత్యం మాట్లాడాలి, ధర్మం దారిలో నడవాలి. అన్యాయం జరిగితే ఎదురు తిరిగి పోరాడాలి అనే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది. సినిమా ఎప్పుడు విడుదలైంది అన్నది కాదు… ప్రేక్షకులపై దాని ప్రభావం ఎంత ఉందన్నదే ముఖ్యం” అని బాలకృష్ణ స్పష్టం చేశారు. విడుదల ఆలస్యం కావడాన్ని దేవుడు పెట్టిన పరీక్షగా భావిస్తున్నానని, ప్రేక్షకులు ఇచ్చిన విజయం ముందు అవన్నీ ఆఫ్ట్రాల్ అని బాలయ్య వ్యాఖ్యానించారు.