Bala Krishna | నందమూరి బాలయ్య రూటే సపరేటు. ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ, మరోవైపు సినిమాలతోను ప్రేక్షకులని అలరిస్తూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘అఖండ’ కి కొనసాగింపుగా వస్తున్న ‘అఖండ తాండవం’ మూవీ చివరి దశకు చేరుకుంది. తొలి భాగం కలెక్షన్ల పరంగా ఎంత హవా చూపించిందో, ఈ సీక్వెల్ దాన్ని మించి ఉంటుందని అంటున్నారు. కథ, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో బోయపాటి – బాలయ్య కాంబో మరో బ్లాక్ బస్టర్‌ని తమ ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు. ఇక ‘అఖండ తాండవం’ పూర్తి చేసిన వెంటనే బాలయ్య ‘జైలర్’ సీక్వెల్ సెట్స్ పైకి అడుగుపెట్టనున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్ సీక్వెల్లో, బాలయ్యకు ఒక పవర్ఫుల్ రోల్ ఆఫర్ చేస్తున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ‘కూలీ’ సినిమాలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్న రజనీ, ఇప్పుడు బాలయ్యతో నటించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. జైలర్ సీక్వెల్ పూర్తైన తర్వాత బాలయ్య .. క్రిష్ జాగర్లమూడి, గోపి చంద్ మలినేనితో సినిమాలు చేయనున్నారు. ఈ రెండు సినిమాలని సమాంతరంగా పూర్తి చేయనున్నారని అంటున్నారు. గోపిచంద్ -బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ హిట్ తర్వాత మళ్లీ కలసి పని చేయడం ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్‌గా మారనుంది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం గోపీచంద్, బాలయ్య కోసం ఒక వినూత్నమైన ఎపిక్ స్టోరీ రెడీ చేస్తున్నాడట. ఇది చరిత్రను మరియు వర్తమానాన్ని మిళితం చేసిన కథ కావడం విశేషం. యాక్షన్, ఎమోషన్, స్కేల్ పరంగా భారీగా మలచబోతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ చారిత్రక నేపథ్యంతో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో బాలయ్య అభిమానులు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ని గుర్తు చేసుకుంటున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, పీరియాడిక్ విజువల్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రయాణంలోకి తీసుకెళ్లనుంది. మరోవైపు క్రిష్ చిత్రం ఆదిత్య ఆదిత్య 369కి కొనసాగింపుగా ఉంటుందని సమాచారం. వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది.