Bala Krishna | ఈ సారి జాతీయ అవార్డ్‌లలో తెలుగు సినిమాలు సత్తా చాటడం పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రాన్ని ఉత్తమ తెలుగు చిత్రంగా జ్యూరీ సభ్యులు అనౌన్స్ చేశారు. ఇక హనుమాన్ సినిమాకి రెండు అవార్డ్లు దక్కాయి. ఉత్తమ ఏవీజీసీ( యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్), ఉత్తమ యాక్షన్ దర్శకత్వ విభాగంలో పురస్కారాలని సొంతం చేసుకుంది.ఇక బేబి చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా, ఉత్తమ గేయ రచయిత బలగం చిత్రానికి పురస్కారాలు దక్కాయి. బేబిలోని ప్రేమిస్తున్నా పాటకిగాను ఉత్తమ గాయకుడిగా పీవీఎన్ఎస్ రోహిత్‌కి జాతీయ పురస్కారం దక్కింది. దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం గెలుచుకుంది.
తాజాగా ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2023లో విడుదలైన చిత్రాలకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలు ప్రకటించింది. 22 భాషల్లో విడుదలైన 115 సినిమాలను జ్యూరీ సమీక్షించగా, వీటిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” ఎంపికైందన్న వార్త అభిమానుల్లో ఆనందోత్సాహాలను కలిగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ తొలిసారి తెలంగాణ యాసలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కథనంలో ప్రధాన పాత్రగా నటించిన శ్రీలీల ప్రదర్శనకు కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ (తెలుగు) చిత్రంగా ఎంపిక కావడాన్ని చిత్ర బృందం గర్వంగా భావిస్తోంది.
ఈ గౌరవాన్ని అందుకున్న తర్వాత బాలకృష్ణ తన భావాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గౌరవం. ఈ గౌరవం మా చిత్ర బృందానికి చెందుతుంది. Shine Screens (India) LLP తరఫున నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, అద్భుతంగా కథను తెరకెక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి, అలాగే ప్రతీ కళాకారుడు, సాంకేతిక నిపుణుడు, సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. జాతీయ అవార్డుల జ్యూరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. భారతదేశం నలుమూలల నుండి అవార్డు అందుకున్నవారందరికీ అభినందనలు. వారి ప్రతిభ భారతీయ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. ఈ గుర్తింపు మాకు మరింత ప్రేరణనిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే కథలను అందించాలన్న మా తపనను బలపరుస్తోంది అని అన్నారు బాలయ్య.