శాండల్‌వుడ్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. అతి చిన్న వయసులోనే ఆయన అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వెండితెరపై మాత్రమే కాకుండా సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే పునీత్ హఠాన్మరణం చెందడం అందరిని శోకసంద్రంలో ముంచెత్తింది.పునీత్ మృతి పట్ల శాండల్‌వుడ్ ప్రముఖలే కాక టాలీవుడ్,బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
46 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయిన పునీత్ రాజ్ కుమార్ తీరని బాధని మిగిల్చాడు. ఆయన పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తీసుకెళ్లారు. ఆయన భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులు అర్పించడానికి బెంగుళూరు బయలుదేరారు. తాజాగా బాలకృష్ణ .. పునీత్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు. కంఠీరవ స్టేడియానికి మెగాస్టార్ చిరంజీవి సాయంత్రం చేరుకోనున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ప్రముఖులు కూడా వెళ్లనున్నట్టు సమాచారం.