Bakasura Restaurant | ప్రముఖ కమెడియన్లు ప్రవీణ్ (Praveen) వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్జే శివ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రాన్ని ఎస్జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మించారు. కామెడీ ఎంటర్టైనింగ్గా వచ్చిన ఈ సినిమాలో షైనింగ్ ఫణి (బమ్చిక్ బంటి), కేజీఎఫ్ గరుడ రామ్, కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్న, వివేక్ దండు, అమర్, రామ్‌పటాస్, రమ్య, ప్రాచీ ఠాకూర్, జబర్థస్త్ అప్పారావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూసుకుంటే.?
కథ
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పరమేశ్వర్ (ప్రవీణ్) తన నలుగురు స్నేహితులతో కలిసి ఒకే రూమ్‌లో ఉంటూ జీవనం సాగిస్తుంటాడు. తనకు ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఉద్యోగం చేస్తుంటాడు. అయితే ఎలాగైనా ఒక రెస్టారెంట్ పెట్టాలనేది పరమేశ్వర్ కల. ఒకసారి తన స్నేహితులతో ఈ విషయం చెప్పగా.. డబ్బుల కోసం యూట్యూబ్‌లో దెయ్యాల వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లుగానే వాళ్ళు చేసిన మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఒక పాడు బడిన బంగ్లాకి వెళతారు. అక్కడ వారికి ఒక మంత్రాలతో ఉన్న పుస్తకం దొరుకుతుంది. దీంతో దానిని వెంటబెట్టి రూమ్‌కి తెచ్చుకుంటారు. ఈ పుస్తకంలో ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా, 200 ఏళ్ల నాటి ఆత్మ ఒక నిమ్మకాయలోకి వస్తుంది. ఆ ఆత్మకు విపరీతమైన ఆకలి. ఇంట్లో ఉన్న ఆహారం మొత్తాన్ని తినేస్తుంది.
ఆ నిమ్మకాయలోని ఆత్మను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుండగా, పరమేశ్వర్ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు (ఫణి) శరీరంలోకి ఆ ఆత్మ ప్రవేశిస్తుంది. ఇప్పుడు అంజిబాబు శరీరంలో ఉన్న ఆత్మను వదిలించడానికి పరమేశ్వర్ అతని స్నేహితులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అసలు బక్క సూరి (వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిదే అని తెలిసిన తర్వాత పరమేశ్వర్ ఏం చేశాడు? అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఇది ఒక రొటీన్ కామెడీ హారర్ చిత్రం. తెలుగు తెరపై ఇలాంటి కథలు కొత్తేమీ కాదు. ఒక ఆత్మ ఉండడం, దానికో ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్, చివరికి దాని కోరిక నెరవేర్చడం – ఈ ఫార్ములాలోనే ఈ సినిమా కూడా సాగుతుంది. అయితే ఇందులో దెయ్యాన్ని తిండిబోతుగా చూపించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం తాంత్రిక పూజ సన్నివేశంతో మొదలైన వెంటనే కథ హైదరాబాద్‌కు మారుతుంది. హీరో పరిచయ సన్నివేశంతో అసలు కథ మొదలవుతుంది. డబ్బుల కోసం యూట్యూబ్ వీడియోలు చేయాలనుకోవడం, గోస్ట్హౌస్కి వెళ్లడం, అక్కడ జరిగే సంఘటనలు నవ్వులు పంచుతాయి. అయితే ఇలాంటి తరహా కామెడీని మళ్లీ మళ్లీ చూపించడం ప్రేక్షకులకు బోర్ కొట్టవచ్చు. ఇక అంజిబాబు పాత్ర ఎంట్రీ.. అతడిలో బకాసుర ఆత్మ వెళ్లిన తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది.
ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. బక్క సూరి ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటాయి. ఆత్మను ఉపయోగించి డబ్బు సంపాదించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి. అయితే ప్రీ-క్లైమాక్స్ లో వచ్చే అల్లరి దెయ్యాల కామెడీ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్ ను ఎమోషనల్ గా మలిచే ప్రయత్నం చేశారు. రొటీన్ కామెడీ హారర్ కథే అయినా… తిండిబోతు దెయ్యం మాత్రం కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది.
నటినటులు
టాలీవుడ్లో కమెడియన్‌గా అలరించిన ప్రవీణ్, ఈ సినిమాలో హీరోగా నటించాడు. సినిమా భారాన్ని తన భుజాలపై వేసుకుని, కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. వైవా హర్ష పాత్ర తెరపై తక్కువ సమయమే కనిపించినా, తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించాడు. అంజిబాబు పాత్రలో ఫణి నటన సినిమాకు ఒక ప్రధాన బలం. చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించిన కృష్ణ భగవాన్, ఒక హోటల్ యజమానిగా తన పంచ్ డైలాగులతో నవ్వులు పూయించారు.
సాంకేతికంగా
సాంకేతిక అంశాల పరంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. దర్శకుడు ఎస్జే శివ చేసింది మొదటి సినిమా అయినా చాలా సినిమాలు చేసిన అనుభవం ఉన్నట్లు కనిపిస్తది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. పాటలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు మాత్రం చక్కగా ఉన్నాయి.
రేటింగ్ 2.5/5