‘ఉగ్రం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో కన్నడంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో శ్రీమురళి నటిస్తున్న తాజా చిత్రం ‘భగీర’. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి భారీ ఫ్రాంఛైజీలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్నది. డా॥ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. రుక్మిణి వసంత్ కథానాయిక. ఆదివారం హీరో శ్రీమురళి జన్మదినం సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. లోకంలో అన్యాయం పెరిగినప్పుడు దానిని అంతం చేయడానికి ఓ హీరో వస్తాడని తెలియజెపుతూ టీజర్ పవర్‌ఫుల్‌గా సాగింది. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతాన్నందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.