బ్యాడ్‌ల్యాండ్ హంటర్స్
నెట్‌ఫ్లిక్స్: జనవరి 26
తారాగణం: మా డోంగ్ సియాక్, నో జాంగ్, లీ జూన్, కిమ్ యంగ్ సన్ తదితరులు.
దర్శకత్వం: హా యంగ్ హింగ్.
Badland Hunters | సియోల్ నగరంలో యంగ్ అనే శాస్త్రవేత్త ఉంటాడు. అనుకోకుండా అతని కూతురు చనిపోతుంది. తన ప్రయోగాల ద్వారా కూతురిని బతికించుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఎందరి ప్రాణాలనో బలి తీసుకుంటాడు. విషయం తెలిసిన పోలీసులు యంగ్‌ను అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతారు. అదే సమయంలో భారీ భూకంపం రావడంతో సియోల్‌తో పాటు చుట్టుపక్కల నగరాలన్నీ నేలమట్టం అవుతాయి. భూకంపం నుంచి బతికి బయటపడ్డ ప్రజలు బృందాలుగా చిన్నచిన్న టెంట్ విలేజ్‌లు నిర్మించుకుంటారు.
ఆ విపత్తులో ప్రాణాలతో బయటపడ్డ యంగ్.. తన కూతురు మృతదేహాన్ని రసాయనాల్లో భద్రపరుస్తాడు. ఓ అపార్ట్‌మెంట్‌ను తన ప్రయోగశాలగా మారుస్తాడు. కొందరు సైనికుల సాయంతో ఆరోగ్యవంతులైన యువతీయువకులను తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తుంటాడు. ఇదే క్రమంలో మాయమాటలు చెప్పి ఓ టెంట్ విలేజ్ నుంచి సున అనే యువతిని అపార్ట్‌మెంట్‌కు రప్పిస్తాడు. సునతో వెళ్లిన ఆమె బామ్మను కొందరు దుండగులు చంపుతుండటాన్ని టెంట్ విలేజ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు చూస్తారు. సున ప్రమాదంలో ఉందని గ్రహిస్తారు. ఆమెను కాపాడటానికి అపార్ట్‌మెంట్‌కు వెళ్తారు. వీరి ప్రయత్నం సఫలమైందా? యంగ్ ప్రయోగాలను వీళ్లు అడ్డుకున్నారా, లేదా? అన్నది మిగిలిన కథ. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది.