Baby Movie | ఈ మధ్య కాలంలో సినిమాలు ఒక వీక్ ఆడితే చాలు అదో పెద్ద సంచలనం అన్నట్లు అయిపోయింది. పెద్ద సినిమాలు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. అయితే చిన్న సినిమాగా విడుదలైన బేబి మాత్రం సంచలనం అనే మాటను కూడా దాటుకొని వెళ్తుంది. సినిమా రిలీజై రెండు వారాల దాటిన ఇంకా కలెక్షన్ ప్రభావం మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకు ఈ సినిమాకు ఆధరణ పెరుగుతూనే ఉంది. టిక్కె్ట్లు సైతం భారీ సంఖ్యలో తెగుతూనే ఉన్నాయి.
నిన్న, మొన్నటి వరకు ఓ వైపు జోరుగా వానలు పడుతున్నా.. మరో వైపు బేబితో హాల్స్ నిండుగా కనిపించాయి. అసలు స్టార్ కాస్ట్ లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అంత కన్నా కాదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీశారు. ఇప్పుడా నమ్మకమే కోట్లు కుమ్మరిస్తుంది. హిట్ నుంచి డబుల్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు సైతం ఆ రేంజ్లో లాభాలు తీసుకురాలేదని పలువురు డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెబుతున్నారు.
తాజాగా ఈ సినిమా ఓ సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. వరుసగా 13వ రోజు కోటి రూపాయిల షేర్‌ను సాధించి కేజీఎఫ్-2 రికార్డును బద్దలు కొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కోటి రూపాయల షేర్ ఎక్కువ రోజుల సాధించిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ పదిహేడు రోజులతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్ సినిమా 12రోజులతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఇక ఇప్పుడు కేజీఎఫ్ రికార్డు బ్రేక్ చేసి 13రోజులు వరుసగా కోటి రూపాయల షేర్ సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది.
ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.70 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. బ్రో సినిమా రిలీజ్ కాకపోతే మరో పది, పదిహేను కోట్లు సునాయసంగా వచ్చేవి. బ్రో సినిమా రిలీజ్‌తో బేబి థియేటర్ల సంఖ్య సగానికి పైగా పడిపోయింది. దాదాపుగా ఈ సినిమా రన్ పూర్తయిపోయినట్లే. పట్టుమని పది కోట్ల బడ్జెట్ కూడా లేని బేబి ఏకంగా 70కోట్లు కొల్లగొట్టిందంటే మామాలు విషయం కాదు. ఈ సినిమాతో అటు ఆనంద్ దేవరకొండ, ఇటు వైష్ణవి చైతన్య ఇద్దరూ జాక్ పాట్ కొట్టేశారు.