Keerthy Suresh | ముంబయి మీడియా ఫొటోగ్రాఫర్ల అనుచిత వ్యాఖ్యలు కథానాయిక కీర్తి సురేష్‌కు కాస్త ఆగ్రహం తెప్పించాయి. అయినా భావోద్వేగాలను నియంత్రించుకొని ఆమె వ్యవహరించింది. ఈ నేపథ్యంలో దక్షిణాది నాయికలపై అక్కడి మీడియా వివక్షాపూరిత వైఖరి పట్ల విమర్శలొస్తున్నాయి. ఈ వివాదం వివరాల్లోకి వెళితే.. హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేస్తూ కీర్తి సురేష్ నటించిన ‘బేబీ జాన్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా ముంబయిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై బయటికొస్తున్న కీర్తి సురేష్‌కు మీడియా ఫొటోగ్రాఫర్లు ఎదురుపడ్డారు. ఫొటోలు తీస్తున్న సమయంలో కొందరు ఆమెను ‘కృతి’ అనే పేరుతో పదే పదే పిలిచారు. దీంతో ఆసహనానికిలోనైన కీర్తి సురేష్.. తన పేరు కీర్తి అని వారికి గుర్తు చేసింది.
ఇంతలోనే కొందరు ఫొటోగ్రాఫర్స్ కీర్తి దోశ అంటూ పిలిచారు. ఆ పిలుపుతో ఇబ్బందికి గురైంది కీర్తి సురేష్. అయినా తన కోపాన్ని అణచుకొంటూ ‘నా పేరు కీర్తి సురేష్. కీర్తి దోశ కాదు..దోశ నాకు చాలా ఇష్టం’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దక్షిణాది నాయికలను అవహేళన చేసే విధంగా ‘దోశ’ అని పిలవడం పట్ల పలువురు సినీ తారలు అభ్యంతరం వ్యక్తం చేశారు.