Babloo Prithviraj | పెళ్లి అనే సినిమాలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన బబ్లూ ప్రృథ్వీరాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పెళ్లి పందిరి, చెన్నకేశవ రెడ్డి, సంతోషం మొదలు ఇటీవల వచ్చిన యానిమల్, తండేల్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి వరకు మూడు దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ వచ్చిన ఇతను ఈ మధ్య అడపాదడపా సినిమాలలో కనిపిస్తూ అలరిస్తున్నాడు. అయితే బబ్లూ పృథ్వీరాజ్ కు ఈ మధ్య ఒక చేదు అనుభవం ఎదురు కాగా, ఆ విషయాన్ని స్వయంగా పాడ్‌కాస్ట్‌లో తెలియజేశాడు. ఇన్ని సినిమాలలో చేసి అంత మంచి పేరు తెచ్చుకున్న ఈ నటుడికి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలుసుకొని అందరు షాక్ అవుతున్నారు.
దిలీప్ ప్రకాష్-రెజీనా జంటగా, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఉత్సవం సినిమా గత ఏడాది రిలీజ్ అయింది. కోవిడ్ ముందు చిత్రీకరణ పూర్తైన పలు కారణాల వలన వాయిదా పడింది. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, ఆ కార్యక్రమానికి గుర్తు పెట్టుకొని బబ్లూ పృథ్వీరాజ్‌ని ఆహ్వానించారట. దాంతో ఆయన చాలా సంతోషించాడు. ఇక సంతోషంతో ఆ కార్యక్రమానికి కూడా వెళ్లాడు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వేరే షూటింగ్‌లను కూడా రద్దు చేసుకొని వెళ్లినట్టు తెలియజేశాడు.
ఇక ఈవెంట్‌కి వెళ్లాక ప్రొడ్యూసర్లను, దర్శకుడిని పలకరించగా వాళ్లు సరిగ్గా మాట్లాడలేదని, అయితే ఈవెంట్ హడావిడిలో ఉన్నారేమో అనుకొని సరిపెట్టుకున్నా. వెళ్లి ఒక చోట కూర్చంటే ఎవరో వస్తున్నారంటూ మూడు నాలుగు సార్లు లేపి వేరే చోట కూర్చోపెట్టారు. ఇక స్టేజ్ పైకి పెద్ద నటులు మొదలు మేకప్ ఆర్టిస్టుల వరకు అందరిని పిలిచి తనను మాత్రం పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడితో మాట్లాడుతుండగా కావాలని వచ్చి ఆయన్ని ఒకరు పిలుచుకొని వెళ్లారని పృథ్వీ అన్నాడు. ఈవెంట్ అంతా ముగిశాక గ్రూప్ ఫొటో కోసం అందరిని పిలిచారు. తనను కావాలని వెనుక వరుసలో నిలబెట్టారని పృథ్వీరాజ్ బాధపడ్డాడు. నావెనక నిలబడిన గిరిబాబును ప్రత్యేకంగా పిలిచి ముందు వరుసలో నిలబెట్టి తనని మాత్రం పట్టించుకోలేదని వాపోయాడు. యానిమల్ సినిమా తర్వాత తనకు మంచి పేరు వచ్చిందని అనుకున్నా, కాని గుర్తింపు లేదని తెలిసి బాధపడ్డానంటూ పృథ్వీ అన్నారు.