Trigun New Movie | యంగ్ హీరో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకత్వంలో ఒక కంప్లీట్ హోల్సమ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక పవర్ ఫుల్ యాంథమ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మిస్తున్న ఈ చిత్రానికి CH.V.S.N బాబ్జీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించగా, ఇప్పుడు విడుదలైన యాంథమ్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ పాటలో శ్రీకృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విజువల్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ ప్రత్యేక గీతాన్ని ప్రముఖ సింగర్ బాబా సెహగల్ తనదైన శైలిలో ఫుల్ ఎనర్జీతో ఆలపించి మాస్ అప్పీల్ తీసుకొచ్చారు. ప్రకాశ్ చెరుకూరి అందించిన అద్భుతమైన ట్యూన్ సాంగ్‌కు ప్రాణం పోయగా, నిర్మాత అరవింద్ మండెం స్వయంగా రాసిన లిరిక్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను, మట్టి వాసనను నేటి ఆధునిక టెక్నాలజీతో మేళవించి ఆయన అందించిన సాహిత్యం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంది.
యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిన ఈ పాట సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, డీవోపీ రవికుమార్ వంటి దిగ్గజ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్, సప్తగిరి, హర్ష చెముడు వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రం త్వరలోనే వెండితెరపై సందడి చేయనుంది.