Baba Movie Re-Release Trailer | ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ-రిలీజ్‌ల హవా నడుస్తుంది. స్టార్ హీరోల బర్త్‌డేలు అయిన, స్టార్ హీరోలు నటించిన సినిమాలు పది, ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 4K ప్రింట్‌తో రీ-రిలీజ్ చేస్తున్నారు. గత రెండు,మూడు నెలల నుండి ఈ ట్రెండ్ మరింత జోరు అందుకుంది. ఇప్పటికే టాలీవుడ్లో ఇలా మూడు, నాలుగు సినిమాలు రిలీజై మంచి కలెక్షన్లు కూడా సాధించాయి. కాగా ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బాబా రి-రిలీజ్‌కు సిద్ధమైంది. బాబా సినిమా 2002లో రిలీజైంది. ‘నరసింహా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని రజనీ ఈ చిత్రాన్ని చేశాడు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మళ్లీ 20ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కానుంది. అయితే కేవలం తమిళంలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రీ-రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టు ట్రైలర్‌ను బాగా కట్ చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే సినిమాలో కొన్ని సీన్స్ యాడ్ చేసినట్లు తెలుస్తుంది. సూపర్ నేచురల్ యాక్షన్ ఫిలిమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకు జోడీగా మనీషా కొయిరాల నటించింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లోటస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రజనీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఈ చిత్రం అప్పట్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి డివైడ్ టాక్ తెచ్చుకుని డిస్ట్రిబ్యూటర్లకు నష్టాల్ని తెచ్చిపెట్టింది. కాన్సెప్ట్ కొత్తదే అయినా, కథనం బోరింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు.