Baahubali The Epic | భారతీయ సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన మెగా బ్లాక్‌బస్టర్ ‘బాహుబలి’ విడుదలై దాదాపు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రెండు పార్టులను కలిపి రూపొందించిన స్పెషల్ ఎడిషన్ ‘బాహుబలి: ది ఎపిక్’ ఈ నెల అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. తాజా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా,సినిమా రన్‌టైమ్, కొత్త సీన్స్, ప్రమోషన్స్‌పై ఆసక్తి నెలకొంది. ఈ స్పెషల్ ఎడిషన్ క్లైమాక్స్‌లో ‘బాహుబలి 3’ కు సంబంధించి ఏదైనా హింట్ ఉంటుందా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ, “ఇది పూర్తిగా రూమరే… బాహుబలి 3పై ఇంకా చాలా పని మిగిలి ఉంది. కానీ ‘బాహుబలి: ది ఎపిక్’లో చిన్న సర్ప్రైజ్ మాత్రం ఉండొచ్చు అని చెప్పి సినిమాపై మరింత ఉత్కంఠను పెంచారు.
ఇక ఈ రీ-రిలీజ్ ద్వారా ఎంత కలెక్షన్స్ ఆశిస్తున్నారు?’ అనే ప్రశ్నకు శోభు స్పందిస్తూ, “ఇది కలెక్షన్ల కోసమే కాదు. ఇది ఓ సెలబ్రేషన్. బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో ప్రేక్షకులకు ఓ గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్లాన్ చేశాం.” అని తెలిపారు.ఈ మూవీ రన్ టైమ్ ఎన్ని గంటలుంటుందన్న విషయమై ఇంకా అధికారిక సమాచారం లేదు. రెండు భాగాల నుంచి కీలకమైన సన్నివేశాలు మాత్రమే తీసుకొని నిర్మించిన ఈ స్పెషల్ ఎడిషన్ గురించి నటుడు రానా దగ్గుబాటి మాట్లాడుతూ, “ఏ సీన్లు ఉంచారు? ఏవి తీసేశారు? అన్నది రాజమౌళికి మాత్రమే తెలుసు” అన్నారు. గతంలో ‘కన్నా నిదురించరా’ పాటను తీసేయాలని రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఓ భారీ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ ఈవెంట్‌కు ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి పాల్గొననున్నట్లు సమాచారం. గతంలో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన ఈ ఫ్రాంచైజీ పునరావృతమవుతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.‘బాహుబలి: ది బిగినింగ్’ 2015లో, ‘బాహుబలి: ది కంక్లూజన్’ 2017లో విడుదలై ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాయి. ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ రీ-రిలీజ్‌తో మళ్లీ అదే మేజిక్ రిపీట్ కానుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.