Baahubali: The Epic | దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ ‘బాహుబలి’ని మళ్లీ రీ-రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) పేరుతో రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా మేకర్స్ విడుదల చేశారు. అయితే, ఈ సినిమా రీ-రిలీజ్లో రికార్డులు సృష్టిస్తుంది అనుకుంటే బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేదని తెలుస్తోంది. దాదాపు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు కలెక్షన్లు ఆశించిన చిత్రబృందానికి ఇప్పటివరకు రూ. 50 కోట్లు కూడా వసూళ్లు సాధించలేదని తెలుస్తుంది. మొదటి రోజు దక్కిన భారీ ఓపెనింగ్స్ తర్వాత వసూళ్లు నెమ్మదించడంతో సినీ నిపుణులు దీనిపై తమ విశ్లేషణను పంచుకున్నారు.
ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం ‘ది ఎపిక్’ వసూళ్లు మందగించడానికి ప్రధానంగా చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ప్రేక్షకులు ఇప్పటికే టీవీలు, ఓటీటీలలో ఈ సినిమాను అనేకసార్లు చూసేయడంతో ఎడిట్ చేసిన వెర్షన్లో కొత్తదనం లేకపోవడం ఒక ప్రధాన లోపంగా మారింది. అలాగే రెండు భాగాల సినిమాను ఒకేసారి 3 గంటల 45 నిమిషాల భారీ నిడివితో మళ్లీ చూడాలంటే ప్రేక్షకులకు విరక్తి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ భారీ నిడివి కారణంగా, వీకెండ్ తర్వాత షోల సంఖ్య తగ్గడం, ప్రేక్షకులు ఎక్కువ సమయం కేటాయించడానికి వెనుకడుగు వేయడం స్పష్టంగా కనిపించింది.
మరో ముఖ్యమైన కారణం హిందీ మార్కెట్లో వైఫల్యం. తెలుగు రాష్ట్రాలలో రీ-రిలీజ్‌లలో రికార్డులు సృష్టించినప్పటికీ దాదాపు రూ. 500 కోట్లు వసూలు చేసిన హిందీ మార్కెట్లో మాత్రం వసూళ్లు అత్యంత మందకొడిగా సాగాయి. హిందీ ప్రేక్షకులకు మరోసారి ఈ కథను థియేటర్లో చూసే ఆసక్తి పెద్దగా లేకపోవడాన్ని ట్రేడ్ నిపుణులు గుర్తించారు. ఇక నిడివిని తగ్గించే క్రమంలో రాజమౌళి కొన్ని కీలకమైన పాటలు, సన్నివేశాలను (ఉదా. అవంతిక-శివుడి లవ్ ట్రాక్, సూపర్ హిట్ సాంగ్స్) తొలగించడం కూడా అభిమానుల నుండి కొంత నిరాశను తెచ్చిపెట్టి, వసూళ్లపై ప్రభావం చూపింది.
అయితే ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ ‘బాహుబలి: ది ఎపిక్’ ఒక రీ-రిలీజ్ చిత్రంగా మాత్రం భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇండియాలో రీ-రిలీజ్ అయిన చిత్రాలన్నింటిలోనూ అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. అలాగే తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్‌లు, మొదటి రోజు కలెక్షన్లు ఒక కొత్త సినిమా స్థాయిని తలపించాయి. నిస్సందేహంగా, ‘బాహుబలి: ది ఎపిక్’ భారతీయ సినిమా బ్రాండ్ వాల్యూను మరోసారి చాటి చెప్పింది. అయితే ఇప్పటికే ప్రేక్షకుల మదిలో చెరిగిపోని విధంగా ముద్ర వేసిన అసలు భాగాల విజయాన్ని మళ్లీ అందుకోవడం ఎంత కష్టమనే విషయాన్ని ఈ చిత్రం బాక్సాఫీస్ ఫలితాలు మరోసారి రుజువు చేశాయని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.