Ayushmann Khurrana | బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా రూపొందుతున్న ‘పతి పత్ని ఔర్ వో డో’ (Pati Patni Aur Woh Do) చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. శనివారం మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. 2019లో కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చి సూపర్ హిట్ సాధించిన ‘పతి పత్ని ఔర్ వో’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రాబోతుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో ఆయుష్మాన్ ఖురానా ‘ప్రజాపతి పాండే’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఖాకీ యూనిఫాంలో ఉన్న ఆయన, ఒక బంగారు రంగు నెట్లో చిక్కుకుని భయంతో ఉండగా, పక్కనే ఒక పెద్ద చిరుతపులి ప్రశాంతంగా కూర్చుని ఉండటం పోస్టర్‌పై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
“శికారీ ఖుద్ హోగయా శికార్! (వేటగాడే స్వయంగా వేటగా మారాడు) అంటూ ఆయుష్మాన్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో ఆయుష్మాన్ సరసన సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి ముగ్గురు కథానాయికలుగా నటిస్తున్నారు. వీరి ముగ్గురి వలన ప్రజాపతి పాండే జీవితం ఎలాంటి గందరగోళంలో పడింది అనే అంశంపై ఈ చిత్రం ఉండబోతోంది. టీ-సిరీస్ మరియు బి.ఆర్. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ కామెడీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గతంలో వచ్చిన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఇప్పుడు ఆయుష్మాన్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో అని బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.